Site icon NTV Telugu

West Indies: నికోలస్ పూరన్‌పై విండీస్ బోర్డు వేటు.. పావెల్‌కు పగ్గాలు?

Nicholas Pooran

Nicholas Pooran

West Indies: ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పసికూనలు ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలై సూపర్-12 దశకు అర్హత సాధించకుండానే వెస్టిండీస్ ఇంటిదారి పట్టింది. మొత్తం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం జింబాబ్వేపై మాత్రమే విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో దారుణ వైఫల్యం నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచకప్‌లో వైఫల్యానికి గల కారణాలను తెలుసుకున్న లారా సారథ్యంలోని కమిటీ జట్టులో మార్పులు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్‌పై వేటు వేసింది. అతడి స్థానంలో రోవ్‌మన్ పావెల్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పగ్గాలు అందించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Ghost Patient: దెయ్యంతో సెక్యూరిటీ గార్డు ముచ్చట్లు.. వీడియో వైరల్

కాగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తమ జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని నికోలస్ పూరన్ వివరణ ఇచ్చాడు. పేలవ ఆట తీరుతో అందర్నీ బాధపెట్టామని క్షమాపణలు కోరాడు. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హెట్‌మెయిర్ వంటి ఆటగాళ్లంతా జట్టుకు దూరంగా ఉండటంతోనే తమ జట్టుకు ఈ గతి పట్టిందని పరోక్షంగా వెల్లడించాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని టీ20 లీగ్స్‌లలో ఆడుతున్నా.. తమ బోర్డుతో ఉన్న విభేదాల కారణంగా ఆయా ఆటగాళ్లు మెగా టోర్నీకి దూరంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అటు నికోలస్ పూరన్‌పై ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు కూడా వేటు వేసిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ ఇప్పుడు వేలంలోకి వదిలేసింది. దీంతో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ పోటీ పడుతుందో వేచి చూడాలి.

Exit mobile version