NTV Telugu Site icon

Wasim Jaffer: కోహ్లీ.. నీకిది అవసరమా?

Wasim On Kohli Sledging

Wasim On Kohli Sledging

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే! అప్పటివరకూ ఆచితూచి ఆడిన బెయిర్‌స్టో.. కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన తర్వాత చెలరేగిపోయాడు. భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. టీ20ని తలపించాడని చెప్పుకోవచ్చు. దీంతో, కోహ్లీ అతడి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ బ్యాట్స్మన్ వసీం జాఫర్ వ్యక్తపరిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొడితే, ఒక్కోసారి మనమే చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నాడు.

‘‘కోహ్లీ చేసిన స్లెడ్జింగ్‌, బెయిర్‌ స్టో దూకుడుకు కారణమైందా? అంటే అవునని చెప్పడంలో సందేహం లేదు. అప్పటివరకూ బెయిర్ స్టో జాగ్రత్తగా, నెమ్మదిగా ఆడాడు. కానీ, ఆ తర్వాత ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నిజానికి ఒకరిని కావాలని రెచ్చగొడితే, ఒక్కోసారి మనకే బ్యాక్‌ఫైర్‌ అవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగినట్టు అనిపిస్తోంది. కోహ్లీ స్లెడ్జింగ్‌కు బదులిచ్చే క్రమంలో బెయిర్‌ స్టో రెచ్చిపోయి ఆడాడేమో’’ అంటూ వసీం వ్యాఖ్యానించాడు. కోహ్లీకి అది అవసరం లేదన్నట్టుగా చెప్పాడు. ఇదే సమయంలో భారత బౌలింగ్‌ విభాగంపై కూడా ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇరు జట్ల బ్యాట్స్మన్లు మెరుగ్గానే రాణిస్తున్నారు. అయితే, భారత బౌలర్లు విజృంభించడం టీమిండియాకు కలిసొచ్చింది’’ అని చెప్పాడు. సిరాజ్‌, బుమ్రా, షమీ అద్భుతంగా బౌలింగ్ వేశారని.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 284 పరుగులకే కట్టడి చేవారని వసీం కితాబిచ్చాడు.

కాగా.. బుమ్రా 3, షమీ 2, సిరాజ్‌ 4, శార్దూల్‌ ఠాకూర్ ఒక వికెట్‌తో రాణించడంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా భారత్ 245 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో.. ఇంగ్లండ్‌కు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్లు దుమ్ముదులిపేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే ఔటైనా అలెక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోతున్నాడు.