Vyshak Vijay Kumar Creates Worst Record in IPL History: తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో వైషాక్ విజయ్ కుమార్ ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశాడో అందరికీ తెలుసు. ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతగాడు 4 ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించి, హీరోగా నిలిచాడు. కానీ.. చెన్నైతో జరిగిన ఆ తర్వాతి మ్యాచ్‌లో మాత్రం వైషాక్ దారుణంగా విఫలమయ్యాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో అతడు ఒక వికెట్ అయితే తీశాడు కానీ.. 15.50 ఎకానమీతో 62 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంత చెత్త ప్రదర్శన కనబర్చినందుకు గాను వైషాక్ తన పేరిట ఒక చెత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తరపున అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా అతడు నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు ఇచ్చాడు.
RCB vs CSK: ధోనీ చేసిన పెద్ద తప్పు.. థర్డ్ అంపైర్ నిర్లక్ష్యం.. ఆర్సీబీకి అన్యాయం
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చివరివరకు హోరాహోరీగా సాగిన ఈ పోరులో సీఎస్కే చేతిలో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కాన్వే (83), దూబే (52) శివాలెత్తగా.. రహానే (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇతర ఆటగాళ్లూ తమవంతు సహకారం అందించడంతో.. చెన్నై అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితం అయ్యింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్‌వెల్(76) విరోచిత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్‌కేనే వరించింది. చివర్లో దినేశ్ కార్తిక్ కాస్త మెరుపులు మెరిపించి ఆశలు రేకెత్తించినా, ఆ వెంటనే అతడు ఔట్ అవ్వడంతో ఆర్సీబీ చేతుల నుంచి మ్యాచ్ చేజారింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లంతా పెవిలియన్ బాట పట్టారే తప్ప, ఎవ్వరూ షాట్లు కొట్టలేకపోయారు. తద్వారా.. ఈ మ్యాచ్ సీఎస్కే వశమైంది.
