Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli Big Promise

Virat Kohli Big Promise

Virat Kohli’s Big Promise: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ముందుగా వెస్టిండీస్‌ 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జస్టిన్‌ గ్రీవ్స్‌ (101; 108 బంతుల్లో 12×4) సెంచరీ బాదాడు. మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ (4/40) తిప్పేశాడు. లక్ష్యాన్ని భారత్‌ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (139 నాటౌట్‌; 88 బంతుల్లో), కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ (110; 108 బంతుల్లో) చెలరేగారు. మ్యాచ్ అనంతరం కింగ్ మాట్లాడుతూ.. తన భవిష్యత్ లక్ష్యాలు, ఆటతీరులో మార్పులు, శుభ్‌మన్ గిల్‌తో భాగస్వామ్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం తాను వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టడంతో ఆటపై మరింత స్పష్టత, ప్రశాంతతతో ఉన్నానని కోహ్లీ తెలిపాడు.

మరో ఏడాదిలో వన్డే ప్రపంచ కప్‌ ఉండటంతో తన లక్ష్యం ఏమిటో చాలా స్పష్టంగా తెలుసని విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘మరో ఏడాదిలో వన్డే ప్రపంచ కప్‌ ఉంది. నా టార్గెట్ ఏంటో నాకు చాలా స్పష్టంగా తెలుసు. నాకు లభించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆటలోని విభిన్న అంశాలపై పని చేయాలని నిర్ణయించుకున్నా. శారీరకంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మ్యాచ్ చివరి 15 ఓవర్లలో బౌండరీ టు బౌండరీకి పరుగెత్తడం, ఫీల్డింగ్‌లో ఇన్నర్ రింగ్‌లో తీవ్రత చూపించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నా. నేను ఇంకా ఈ ఫార్మాట్‌లో ఇంకొంతకాలం ఆడుతా. అందుకే ప్రతి రోజును ఆస్వాదించాలనుకుంటున్నా. అవకాశం వచ్చినప్పుడు ఒత్తిడికి గురికాకుండా సంతోషంగా ఆడాలనుకుంటున్నా. నా ఆటను స్వేచ్ఛగా ఆడటమే నా లక్ష్యం’ అని కోహ్లీ చెప్పాడు.

‘నేను ఇకపై కూడా దూకుడైన, సానుకూలమైన క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా. అయితే దూకుడు పేరుతో అనవసరమైన షాట్లు ఆడకుండా జాగ్రత్త వహిస్తా. సానుకూలంగా ఆడతానని నాకు నేనే మాట ఇచ్చుకున్నా. ఎందుకంటే నేను అలా ఆడగలను. అయితే నిర్లక్ష్యంగా మాత్రం ఆడను. పాజిటివ్ క్రికెట్‌కు, ర్యాష్ షాట్లకు మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఓ సీనియర్ ప్రొఫెషనల్‌గా ఆ తేడాను అర్థం చేసుకుని జట్టును విజయతీరాలకు చేర్చగలగాలి. శుభ్‌మన్ గిల్‌తో భాగస్వామ్యం నిర్మించడం పెద్దగా కష్టం కాదు. ఎందుకంటే ఏం చేయాలో అతడికి తెలుసు.. ఏం చేయాలో నాకు తెలుసు. అవసరమైనప్పుడు అనుభవం ఆధారంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. అంతకంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకడు’ అని కింగ్ తెలిపాడు.