Virat Kohli To Retire From T20 Format After T20 World Cup: కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడే.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కూడా ప్రకటించొచ్చన్న ప్రచారం జోరుగా సాగింది. అదే సమయంలో పామ్‌లేమితోనూ ఇబ్బంది పడుతుండడంతో, ఇక కోహ్లీ ప్రస్థానం ముగిసినట్టేనని వార్తలు వచ్చాయి. కానీ, వాటికి చెక్ పెడుతూ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. తన పని ఇంకా అయిపోయిలేదని సత్తా చాటాడు. ఇలాంటి తరుణంలో.. టీ20 ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా? అనే అనుమానాలు తెరమీదకి వచ్చాయి. వన్డే, టెస్టు క్రికెట్‌పై మరింత దృష్టి సారించేందుకు.. అతడు టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడనే రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత.. కోహ్లీ ఈ పొట్టి క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. కోహ్లీకి ఇదే ఆఖరి టీ20 వరల్డ్‌కప్ కాదని అన్నాడు. టీమిండియాకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న కోహ్లీ.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఆడతాడని భావిస్తున్నానన్నాడు. కోహ్లీ ఫామ్, ఫిట్నెస్, పరుగుల దాహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని.. జట్టును గెలిపించాలనే పట్టుదల అతనిలో మెండుగా ఉందని.. కాబట్టి అతనికి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కాదని తాను కచ్ఛితంగా చెప్పగలనని నమ్మకంగా చెప్పుకొచ్చాడు. గడ్డు పరిస్థితులను కూడా కోహ్లీ ధీటుగా ఎదుర్కొన్నాడని.. ఇప్పుడు మరింత ఉత్సాహంగా దూసుకుపోతున్నాడని పేర్కొన్నాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కోహ్లి కీలక పాత్ర పోషిస్తానడంలో సందేహం లేదని ఆయన తెలిపాడు. మరి.. కోహ్లీ ఇంకా కొన్నాళ్లు టీ20 క్రికెట్ ఆడుతాడా? లేక రూమర్లు వస్తున్నట్టుగా ఈ ఏడాది వరల్డ్‌కప్ తర్వాత గుడ్‌బై చెప్పేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
ఇదిలావుండగా.. ఆసియా కప్ టోర్నీలో 71వ శతకం చేసిన కోహ్లీ, ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలోనూ విజృంభించాలని అభిమానులు కోరుతున్నారు. ముఖ్యంగా.. పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపం చూపాలని ఆకాంక్షిస్తున్నారు. పాకిస్తాన్‌పై కోహ్లీ చాలాసార్లు ప్రతాపం చూపిన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి.. అక్టోబర్ 23న పాక్‌తో జరిగే మ్యాచ్‌లో చెలరేగి ఆడుతాడని అనుకుంటున్నారు. మరి, కోహ్లీ అభిమానుల కోరికని తీరుస్తాడా? లేదా? అనేది చూడాలి.