టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. న్యూజిలాండ్ రగ్బీ దిగ్గజం, మాజీ ఆల్ బ్లాక్స్ కెప్టెన్ కెవెన్ మీలాము భారత క్రికెట్ త్రయాన్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురికీ వ్యక్తిగత పేర్లతో రూపొందించిన ప్రత్యేక రగ్బీ జెర్సీలను బహూకరించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లకు రగ్బీ జెర్సీలను అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు తరఫున కెవెన్ మీలాము 132 మ్యాచ్‌లు ఆడారు. ఆల్ బ్లాక్స్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఆయన ఒకరు. అంతేకాకుండా 2011, 2015 రగ్బీ ప్రపంచ కప్‌లు గెలిచిన న్యూజిలాండ్ జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నారు. భారత ఆటగాళ్లకు జెర్సీలు అందించే ముందు కెవెన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లను కలవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ‘మీ దగ్గర ఇప్పటికే ఎన్నో జెర్సీలు ఉండొచ్చు. అయినప్పటికీ మా సంప్రదాయంలోని ‘మన’ (Mana) భావనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా భాషలో ‘మన’ అంటే పరస్పర గౌరవాన్ని పంచుకోవడం మాత్రమే కాదు.. శక్తిని, స్ఫూర్తిని కూడా పంచుకోవడం’ అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మ్యాచ్‌కు ముందు మావోరీ సంప్రదాయానికి చెందిన ప్రత్యేక నినాద ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. సాంస్కృతిక కళాకారులు సంప్రదాయ మావోరీ నినాదాన్ని ప్రదర్శించగా.. భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లను స్టేడియంలోకి తీసుకువచ్చారు. దీంతో మ్యాచ్‌కు ముందు వాతావరణం మరింత సందడిగా మారింది. ఇటీవల శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అనంతరం నవంబర్ 19 నుంచి ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు.

