Site icon NTV Telugu

Virat Kohli: కోహ్లీకి కలిసొచ్చిన రాహుల్.. రికార్డులే రికార్డులు

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మూడేళ్ల పాటు ఫామ్ సమస్యలతో సతమతం అయ్యాడు. ఫామ్ కారణంగా అతడు చివరకు కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. 2019 నుంచి 2022 సెప్టెంబర్ వరకు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ అన్నదే రాలేదు. అయితే ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ మేరకు కెరీర్‌లో 71వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కట్ చేస్తే 72వ సెంచరీ కూడా కోహ్లీ రాహుల్ కెప్టెన్సీలోనే రాబట్టాడు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో విరాట్ 72వ సెంచరీని పూర్తి చేశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే.. 71, 72వ సెంచరీలను కోహ్లీ సిక్సర్లతోనే కంప్లీట్ చేశాడు.

Read Also: IND Vs BAN: రాణించిన బౌలర్లు.. నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ భారీ గెలుపు

దీంతో కోహ్లీ అభిమానులు కేఎల్ రాహుల్‌ను ప్రశంసిస్తున్నారు. రాహుల్ కలిసొచ్చాడంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఆసియాకప్‌లో ఆప్ఘనిస్తాన్‌తో టీమిండియా ఆడిన మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉండగా.. రాహుల్ జట్టును నడిపించాడు. తాజా మ్యాచ్‌కు రోహిత్ బొటన వేలి గాయంతో దూరం కావడంతో మరోసారి రాహుల్ పగ్గాలను అందుకున్నాడు. కాగా శనివారం నాటి సెంచరీతో కోహ్లీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా పాంటింగ్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. పాంటింగ్ తన కెరీర్‌లో 71 సెంచరీలను సాధించాడు. ఈ జాబితాలో సచిన్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అటు బంగ్లాదేశ్‌పై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు బంగ్లాదేశ్‌పై కోహ్లీ వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Exit mobile version