Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!

Virat Kohli Most Odi Ducks

Virat Kohli Most Odi Ducks

Virat Kohli Unwanted Record: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. శుక్రవారం మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ డకౌట్ అవవడంతో ఈ చెత్త రికార్డు నమోదయింది. నాలుగో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు.

మొదటి బ్యాటర్‌గా కోహ్లీ:


వన్డే క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఇద్దరూ తమ వన్డే కెరీర్‌లో 20 సార్లు డకౌట్ అయ్యారు. అయితే సచిన్ 463 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును నమోదు చేయగా.. కోహ్లీ కేవలం 321 మ్యాచ్‌ల్లోనే ఈ జాబితాలోకి చేరడం గమనార్హం. ఈ జాబితాలో భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ 19 డకౌట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

మొత్తంగా జయసూర్య:
టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చెరో 18 డకౌట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. సచిన్ నెలకొల్పిన పలు రికార్డులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లీ.. ఈసారి మాత్రం మాస్టర్ బ్లాస్టర్‌తో ఓ చెత్త రికార్డులో సమంగా నిలిచాడు. వన్డే క్రికెట్ కెరీర్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య ఉన్నాడు. జయసూర్య 433 ఇన్నింగ్స్‌లలో 34 సార్లు డకౌట్ అయ్యాడు.

అత్యధిక డకౌట్ల భారత బ్యాటర్ల లిస్ట్:
సచిన్ టెండూల్కర్ – 20 (463 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లీ – 20 (321 మ్యాచ్‌లు)
జవగల్ శ్రీనాథ్ – 19 (229 మ్యాచ్‌లు)
అనిల్ కుంబ్లే – 18 (295 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ – 18 (269 మ్యాచ్‌లు)
యువరాజ్ సింగ్ – 18 (301 మ్యాచ్‌లు)