Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే చెత్త వన్డే సిరీస్!

Virat Kohli Batting Average

Virat Kohli Batting Average

Virat Kohli Batting Average: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 2026 న్యూజిలాండ్ పర్యటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. నిలకడైన బ్యాటింగ్‌కు, క్లిష్ట పరిస్థితుల్లోనూ పరుగులు సాధించే సామర్థ్యానికి పేరుగాంచిన కోహ్లీ.. ఐదు వన్డేల సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన కింగ్.. 21.5 సగటుతో 86 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. కోహ్లీ కెరీర్‌లో ఇది రెండో అత్యల్ప సగటు కావడం గమనార్హం. అంటే.. కింగ్ కెరీర్‌లోనే రెండో చెత్త వన్డే సిరీస్.

పడిపోయిన సగటు:


మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలోనూ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొన్న విరాట్ కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగాడు. మాథ్యూ ఫిషర్ వేసిన షార్ట్ బాల్‌ను ఆఫ్ స్టంప్‌కు వెలుపల నుంచి ఆడేందుకు ప్రయత్నించగా.. బ్యాట్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ టిమ్ సీఫర్ట్ సులభంగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో కోహ్లీ న్యూజిలాండ్ పర్యటన నిరాశాజనకంగా ముగిసింది. ఈ సిరీస్ ప్రభావం న్యూజిలాండ్‌లో కోహ్లీకి ఉన్న అద్భుతమైన వన్డే రికార్డుపైనా పడింది. ఈ పర్యటనకు ముందు కివీస్ గడ్డపై అతడి బ్యాటింగ్ సగటు 51.53గా ఉండేది. తాజా సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో అది 42.62కు పడిపోయింది.

2014లో అత్యల్ప సగటు:
విరాట్ కోహ్లీ కెరీర్‌లో కనీసం నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో అత్యల్ప సగటు 2014లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో నమోదైంది. అప్పట్లో అతడు కేవలం 18 సగటుతో పరుగులు చేశాడు. ఇప్పుడు 2026లో న్యూజిలాండ్‌పై 21.5 సగటు నమోదు చేశాడు. 2008లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో 31.8 సగటుతో పరుగులు చేశాడు. మరోవైపు ఈ సిరీస్‌లో కోహ్లీ మరో అన్‌వాంటెడ్ రికార్డును కూడా సమం చేశాడు. ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో మూడు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం అతడి కెరీర్‌లో ఇది రెండోసారి. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ వరుసగా 74, 7, 0, 5 పరుగులు చేశాడు. నాలుగో వన్డే వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

టీమిండియాకు కోహ్లీ ఫామ్ కీలకం:
గతంలో 2012-13లో పాకిస్థాన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ మూడు ఇన్నింగ్స్‌ల్లో 0, 6, 7 పరుగులు చేశాడు. అలాగే 2011 వన్డే ప్రపంచ కప్‌లో, 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన కార్ల్టన్ మిడ్ వన్డే ట్రై సిరీస్‌లోనూ అతడి ఖాతాలో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనతో ఆ జాబితాలో మరోసారి చోటు సంపాదించాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు కోహ్లీ ఫామ్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో రానున్న జింబాబ్వే, శ్రీలంక వన్డే సిరీస్‌ల్లో కింగ్ తిరిగి తన పాత ఫామ్‌ను అందుకోవాల్సిన అసవరం ఏంతో ఉంది.

ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో కోహ్లీ అత్యల్ప బ్యాటింగ్ సగటు:
18 – ఇంగ్లాండ్‌పై, 2014
21.5 – న్యూజిలాండ్‌పై, 2026
31.8 – శ్రీలంకపై, 2008