భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన ట్రై నేషన్ సిరీస్ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశేన్ హలంబెజ్ మధ్య జరిగిన తోపులాట క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. మైదానంలో ఇరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ తీవ్రమైన వాగ్వాదంపై మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వైభవ్‌తో గొడవకు దిగినందుకు గాను శ్రీలంక ఆటగాడు విశేన్ హలంబెజ్‌పై మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధించారు. అయితే.. ఈ ఘటనలో ప్రతీకారంగా స్పందించిన వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఇంకా స్పష్టత రాలేదు.
అసలేం జరిగింది?
జూన్ 15న జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత శ్రీలంక ఆటగాడు విశేన్, 15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా మాట్లాడాడు. “మ్యాచ్ అయిపోయింది కదా.. ఇక ఇంటికి వెళ్ళు” అంటూ వైభవ్ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా ఎగతాళి చేశాడు. దీంతో తీవ్ర కోపానికి గురైన వైభవ్, సదరు శ్రీలంక ఆటగాడిని చేతులతో నెట్టివేశాడు. ఆ సమయంలో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మిగిలిన ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు.
శ్రీలంక సీనియర్ల విచారం..
నివేదికల ప్రకారం.. విశేన్ హలంబెజ్ మొదటి మ్యాచ్ నుండి వైభవ్ సూర్యవంశీని లక్ష్యంగా చేసుకుని నిరంతరం స్లెడ్జింగ్ చేస్తున్నాడు. అతని ఏకాగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇదంతా చేశాడు. అయితే, విశేన్ ప్రవర్తనపై శ్రీలంక-ఏ జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆట ముగిసిన తర్వాత శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ విషయంపై తీవ్ర చర్చ నడిచింది. క్రీడా స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని, కొందరు లంక సీనియర్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని కలిసి మైదానంలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అలాగే భారత జట్టుకు అధికారికంగా క్షమాపణలు చెప్పాలా వద్దా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి వైభవ్ సూర్యవంశీపై ఎటువంటి నిషేధం లేదా యాక్షన్ తీసుకున్నట్లు సమాచారం లేదు. భారత యువ ఆటగాడిని కావాలనే టార్గెట్ చేసిన శ్రీలంక ప్లేయర్‌కు మాత్రం రిఫరీ గట్టి షాకే ఇచ్చారు.

