భారత క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిభతో దూసుకొస్తున్న ఎడమచేతి వాటం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ప్రస్తుతం అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సీనియర్ భారత టీ20 జట్టులో చోటు సంపాదించిన అతను, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 36 ఏళ్లనాటి రికార్డును.. అత్యంత పిన్న వయసులో టీమిండియాకు ఎంపికైన ఆటగాడిగా బ్రేక్ చేశాడు. అయితే, ఐర్లాండ్‌తో జరగాల్సిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాలనుకున్న అతని కలలకు అక్కడ తలెత్తిన పరిస్థితులు అడ్డంకిగా మారాయి.
ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్‌లో తీవ్రమైన వలస వ్యతిరేక నిరసనలు, హింసాత్మక అల్లర్లు చెలరేగడంతో స్థానిక వాతావరణం అట్టుడుకుతోంది. ఒక కత్తిపోటు ఘటన అనంతరం అక్కడ అశాంతి నెలకొంది. దీనివల్ల లిస్‌బర్న్‌లో జరగాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్‌ను ఇప్పటికే పూర్తిగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే జూన్ 26, 28 తేదీలలో భారత్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా వాయిదా పడే లేదా రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ అల్లర్ల కారణంగా ఆదివారం జరగాల్సిన ‘ఐరిష్ సీనియర్ కప్’, ‘నేషనల్ కప్’ మ్యాచ్‌ల నిర్వహణపై తదుపరి 48 గంటల్లో తుది నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ స్పష్టం చేసింది.
బీసీసీఐ ప్రత్యేక నిఘా..
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ కోసం ‘ఇండియా ఎ’ జట్టుతో కలిసి బిజీగా గడుపుతున్నాడు. ఐర్లాండ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో అటు ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని అక్కడి క్రికెట్ బోర్డు పేర్కొంది. మరోవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా అక్కడి భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఒకవేళ బెల్ఫాస్ట్‌లో ఉద్రిక్తతలు సద్దుమణగకపోతే, మ్యాచ్‌లను వేరే సురక్షిత ప్రాంతానికి లేదా ఇంగ్లాండ్‌కు ముందే తరలించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సిరీస్ వాయిదా పడినా, తదుపరి ఇంగ్లాండ్ పర్యటన లేదా ఆసియా క్రీడల్లోనైనా సూర్యవంశీ మైదానంలోకి దిగితే అత్యంత పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డులకెక్కడం ఖాయం.

