Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..

Vaibhav And Tilak Varma

Vaibhav And Tilak Varma

శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ తీవ్ర వివాదానికి దారితీసింది. లంక ఆటగాడు విషేన్ హలాంబెజ్‌తో మైదానంలో చోటుచేసుకున్న నెట్టులాట, వాగ్వాదం కారణంగా భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, జట్టు క్రమశిక్షణను సక్రమంగా నిర్వహించలేకపోయినందుకు గానూ భారత కెప్టెన్ తిలక్ వర్మపై మరింత కఠిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మపై మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు నిషేధం కూడా విధించే అవకాశం ఉందని స్పోర్ట్స్‌స్టార్ నివేదిక పేర్కొంది.

అలాగే ఈ గొడవలో భాగమైన లంక ఆటగాడు విషేన్‌కు 50 శాతం, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు 20 శాతం జరిమానా విధించాలని మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రగాష్ సిఫార్సు చేశారు. సూపర్ ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ, విషేన్ హలాంబెజ్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సూర్యవంశీ లంక ఆటగాడిని నెట్టడం కెమెరాల్లో రికార్డయింది. అయితే, వైభవ్ కావాలని ఈ గొడవకు దిగలేదని, టోర్నమెంట్ ప్రారంభం నుండి లంక ఆటగాళ్లు అతని ఐపీఎల్ ప్రదర్శనను ఎగతాళి చేస్తూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది.

×
×
Ad

మ్యాచ్ ముగిసిన తర్వాత ‘ఇక మ్యాచ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళు’ అంటూ విషేన్ చేసిన వ్యాఖ్యలతోనే వైభవ్ సహనం కోల్పోయాడని సమాచారం. సాధారణంగా ‘ఎ’ జట్టు మ్యాచ్‌లకు ఐసీసీ నిబంధనలు నేరుగా వర్తించవు కాబట్టి, మ్యాచ్ రెఫరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీసీఐ , శ్రీలంక క్రికెట్ బోర్డులు సంయుక్తంగా తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ ఓటమి పరాభవంతో పాటు ఆటగాళ్ల ప్రవర్తనపై ఇప్పుడు బోర్డుల నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.