Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?

  • భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్
  • త్వరలోనే సీనియర్ జట్టుకు ఆడనున్న వైభవ్
  • వైభవ్ అరంగేట్రానికి అడ్డంకులు?
Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి అనుకోని అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్.. త్వరలోనే సీనియర్ జట్టుకు ఆడనున్నాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐర్లాండ్‌లో కొనసాగుతున్న సామాజిక అశాంతి పరిస్థితులు ఈ సిరీస్ నిర్వహణపై అనిశ్చితిని నెలకొల్పాయి.

సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తూ అతి పిన్న వయసులో భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో ఇండియా-ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌లో జరగనున్న టీ20 సిరీస్‌లో అతని అరంగేట్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఐర్లాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న సామాజిక ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. ఇప్పటికే లిస్బర్న్‌లో నిర్వహించాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్‌ను రద్దు చేశారు. అలాగే ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్‌ల నిర్వహణపై వచ్చే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ ప్రకటించింది.

×
×
Ad

‘ప్రస్తుతం అశాంతి కొనసాగుతున్న ప్రాంతాల పరిస్థితులను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ అధికారులు, అభిమానుల భద్రతే మా ప్రధాన ప్రాధాన్యం’ అని క్రికెట్ ఐర్లాండ్ తన ప్రకటనలో పేర్కొంది. ఐర్లాండ్ పరిస్థితులను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా గమనిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు మెరుగుపడకపోతే బెల్‌ఫాస్ట్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను వేరే వేదికలకు తరలించే అవకాశాన్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐర్లాండ్‌లో పరిస్థితులు చక్కబడితే వైభవ్ సీనియర్ భారత జట్టుకు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే అక్కడి అశాంతి పరిస్థితులు కొనసాగితే.. భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అరంగేట్రం మరికొంతకాలం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు వైభవ్ సూర్యవంశీ తన ఆటలో కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం మరింత పరిణతితో కూడిన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అఫ్గానిస్థాన్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 44 పరుగులు చేసినప్పటికీ ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా ఎక్కువగా గ్రౌండ్ షాట్లకే ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే వైభవ్ పోరాటం వృథా అయింది. ఆ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు అఫ్గానిస్థాన్-ఏ చేతిలో ఓటమిపాలైంది. అయినప్పటికీ యువ ఆటగాడి బ్యాటింగ్ తీరు క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకుంది.