Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Jacob Oram Vaibhav Sooryavanshi

Jacob Oram Vaibhav Sooryavanshi

Jacob Oram Praises Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవలే 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ కుర్రాడు.. మంగళవారం జరిగిన లిస్ట్-ఏ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌పై మాజీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ ఆసక్తికరంగా స్పందించాడు. కివీస్ బౌలర్లపై వైభవ్ పెను విధ్వంసం సృష్టించకూడదని సరదాగా వ్యాఖ్యానించాడు.

15 ఏళ్ల ఆటగాడిని వన్డే క్రికెట్‌ను కాపాడే రక్షకుడిగా అభివర్ణించడం తొందరపాటే అయినప్పటికీ.. వైభవ్ లాంటి ప్రతిభావంతులు క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తారని ఓరమ్ అభిప్రాయపడ్డాడు. టీ20 క్రికెట్‌ను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారని, సంప్రదాయ క్రికెట్ అభిమానులు టెస్టులను ఆదరిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే 50 ఓవర్ల ఫార్మాట్‌కు కూడా క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉందని తాను ఇప్పటికీ నమ్ముతున్నట్లు తెలిపాడు. వైభవ్ ఆటతీరును ప్రశంసించిన ఓరమ్.. అతడు ఎంతో ఉత్సాహంగా, వినోదాత్మకంగా ఆడతాడని అన్నాడు. ఇలాంటి ఆటగాళ్లు క్రికెట్‌లో ఎక్కువగా ఉండటం ఆటకు మంచిదని పేర్కొన్నాడు. అయితే తమ జట్టు బౌలర్లపై మాత్రం 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయకూడదు అని సరదాగా వ్యాఖ్యానించాడు.

భారత్‌తో రెండో టెస్టు శుక్రవారం నుంచి క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ పిచ్‌తో పోలిస్తే ఇక్కడ పేస్, బౌన్స్, బంతి కదలిక ఎక్కువగా ఉండనుంది. అయితే మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందని ఓరమ్ పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులపై తుది నిర్ణయం మొదటి రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి తీసుకుంటామని తెలిపాడు. వాతావరణం, ఉష్ణోగ్రత, గాలి ప్రభావం, పిచ్ ఎండిపోయే తీరు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత బౌలింగ్ వ్యూహాలను ఖరారు చేస్తామని వివరించాడు. ఈసారి అయినా టాస్ గెలవాలని ఆశిస్తున్నామని సరదాగా చెప్పాడు.

హాగ్లీ ఓవల్ పిచ్‌పై పచ్చికను చూసి బ్యాటింగ్ చాలా కష్టమని భావించాల్సిన అవసరం లేదని ఓరమ్ సూచించాడు. న్యూజిలాండ్‌లో సాధారణంగా మంచి పిచ్‌లు ఉంటాయని, మొదట్లో పచ్చగా కనిపించినా అవి త్వరగా ఎండిపోయి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతాయని వివరించాడు. వెల్లింగ్టన్ టెస్టులో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, ఆ తర్వాత పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా మారిందని గుర్తుచేశాడు. గత ఏడాది హాగ్లీ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టును ఓరమ్ ఉదాహరణగా ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ చివరి రోజు మొత్తం బ్యాటింగ్ చేసి డ్రా చేసుకోగా.. జస్టిన్ గ్రీవ్స్ డబుల్ సెంచరీ సాధించాడు. మొదట్లో పిచ్ కఠినంగా కనిపించినా.. ఆ పరిస్థితులను అధిగమిస్తే ఆ తర్వాత బ్యాటింగ్ సులభమవుతుందని తెలిపాడు.