Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!

Vaibhav Sooryavanshi's Rare Cricket Combo

Vaibhav Sooryavanshi's Rare Cricket Combo

Vaibhav Sooryavanshi’s Rare Cricket Combo: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన ప్రతిభతో పాటు క్రికెట్‌పై మంచి అవగాహన వైభవ్ సొంతమని కొనియాడాడు. ఈ రెండు లక్షణాలు అతడిని భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మార్చగలవని పేర్కొన్నాడు. జపాన్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సుందర్.. వైభవ్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

ప్రమాదకరమైన కలయిక:

‘వైభవ్ సూర్యవంశీ చాలా ప్రతిభావంతుడు. అతడికి మంచి క్రికెట్ బ్రెయిన్ కూడా ఉంది. తన ఆట గురించి మాత్రమే కాకుండా.. ప్రత్యర్థులు, భిన్నమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కూడా అతడికి బాగా తెలుసు. వేర్వేరు జట్లతో, విభిన్న పరిస్థితుల్లో ఎలా పోరాడాలో అర్థం చేసుకోగలడు. తన స్కిల్స్‌తో పాటు ఇంత మంచి క్రికెట్ అవగాహన ఉండటం ప్రమాదకరమైన కలయిక. ఇంత చిన్న వయసులో ఆ స్కిల్స్‌ ఉండడం చాలా రేర్ అనే చెప్పాలి. వైభవ్ ఆడుతుంటే.. ఇంత ఈజీగా సిక్సులు కొట్టచ్చా అని అనిపిస్తుంది’ అని వాషింగ్టన్ సుందర్ అన్నాడు.

ఇప్పటికే మనకు చూపించాడు:
ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ తన సామర్థ్యాన్ని చూపించాడని సుందర్ పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో భారత జట్టు తరఫున అతడు ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘వైభవ్ ఏం చేయగలడో ఇప్పటికే మనకు చూపించాడు. భవిష్యత్తులో దేశం కోసం అతడు చాలా మ్యాచ్‌లు గెలిపిస్తాడని మనమంతా ఆశించవచ్చు. అతడి ఆటను చూడటానికి మనం సిద్ధంగా ఉండాలి’ అని వాషింగ్టన్ సుందర్ చెప్పాడు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి కూడా సుందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జపాన్‌లోని క్రీడాభిమానులు భారత్‌కు వచ్చి ఐపీఎల్ లేదా పెద్ద అంతర్జాతీయ సిరీస్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని సూచించాడు. భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంలా అభిమానిస్తారని చెప్పాడు.

క్రికెట్ ఒక మతం లాంటిది:
‘మీరు భారత్‌కు వచ్చి.. ముఖ్యంగా బిగ్ సిరీస్ లేదా ఐపీఎల్ సమయంలో క్రికెట్‌ను ఎలా జరుపుకుంటారో చూడాలి. భారత్‌లో క్రికెట్ ఒక మతం లాంటిది. ఈ ఆట ద్వారా ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటారు. భారత్‌లో పుట్టి, దేశం తరఫున అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడటం మాకు దక్కిన గొప్ప అదృష్టం. క్రికెట్ చాలా అందమైన ఆట. భారత్ చాలా కాలంగా క్రికెట్ ఆడుతోంది. దేశంలో క్రికెట్ ఆడే వారి సంఖ్య కూడా ఎంతో ఎక్కువ. మనలో చాలా మంది చిన్నప్పటి నుంచే ఈ ఆటతో కలిసి పెరిగాం. నా విషయానికి వస్తే చిన్నతనం నుంచే క్రికెట్ నా జీవితంలో భాగం. భారత్‌లో క్రికెట్ ఆడుతూ, దేశానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా గొప్ప అదృష్టం’ అని సుందర్ తెలిపాడు.

ఇంకా ఎక్కువ ఆశించవచ్చు:
ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 ఫ్రాంచైజీ లీగ్‌గా ఐపీఎల్‌కు ఉన్న గుర్తింపును కూడా సుందర్ ప్రస్తావించాడు. 2008లో ప్రారంభమైనప్పటి నుంచి నాణ్యమైన క్రికెట్‌తో ఐపీఎల్ మరింత స్థాయికి ఎదుగుతోందని చెప్పాడు. ‘ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని నిర్వహిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని ఎంతో మంది నాణ్యమైన ఆటగాళ్లు ఈ లీగ్‌లో భాగం కావాలని కోరుకుంటారు. ప్రతి సీజన్‌లోనూ క్రికెట్ నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఐపీఎల్‌లో భాగం కావడం, ఆ టోర్నీ అనుభూతిని ఆస్వాదించడం మాకు ఎంతో ప్రత్యేకం. రాబోయే రోజుల్లో ఐపీఎల్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించవచ్చు’ అని సుందర్ అన్నాడు.

ప్రతి యువ క్రికెటర్ కల:
చిన్నప్పటి నుంచే భారత జట్టుకు ఆడటమే ప్రతి యువ క్రికెటర్ కల అని సుందర్ పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ యువ ఆటగాళ్లకు గొప్ప వేదికగా మారిందని చెప్పాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ లీగ్‌గా ఐపీఎల్ నిలిచిందని తెలిపాడు. ‘చిన్నప్పటి నుంచే భారత్ తరఫున ఆడాలన్నదే మా లక్ష్యం. అయితే ఐపీఎల్ మాకు ఫ్రాంచైజీ క్రికెట్‌లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో, ఒక అద్భుతమైన వేదికను అందించింది. చిన్నప్పుడు మేము ఐపీఎల్‌లో ఆడాలని కలలు కనేవాళ్లం. ఇప్పుడు కూడా పిల్లలు అదే కలతో ముందుకు సాగుతున్నారు. జపాన్‌లో క్రికెట్ విస్తరిస్తుండటం సంతోషం’ అని పేర్కొన్నాడు.