Vaibhav Sooryavanshi in Trouble: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా జరిగిన ఇండియా-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్‌లో శ్రీలంక విజయం సాధించడం, అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగేతో వాగ్వాదానికి దిగడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఉద్రిక్తత:
దంబుల్లాలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠను పంచింది. ఇరు జట్లు 50 ఓవర్లలో 265 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 పరుగులు చేయగా.. భారత్ 9 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. ఓటమి అనంతరం భావోద్వేగాలకు లోనైన వైభవ్ సూర్యవంశీ.. శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగేతో వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐసీసీ కోడ్ ప్రకారం చర్యలు ఉండొచ్చా?:
ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 ప్రకారం మ్యాచ్ సమయంలో లేదా మ్యాచ్ అనంతరం ప్లేయర్స్.. ఇతర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అంపైర్లు లేదా ఇతరులతో గొడవలు పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధం. ఈ నిబంధన ప్రకారం ఉద్దేశపూర్వకంగా లేదా కావాలనే మరో ఆటగాడిని నెట్టడం, భుజంతో ఢీకొట్టడం, శారీరకంగా బెదిరించడం వంటి చర్యలు తప్పుగా పరిగణించబడతాయి. సంఘటన తీవ్రత, ఉద్దేశ్యం, జరిగిన శారీరక స్పర్శ బలం, ఎవరైనా గాయపడారా వంటి అంశాలను పరిశీలించి మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు.
హెచ్చరికతో సరిపెడతారా? లేక శిక్ష విధిస్తారా?:
వైభవ్ సూర్యవంశీ, విశెన్ హలంబగే మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి వెళ్లకముందే.. ఇతర ఆటగాళ్లు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో మ్యాచ్ రిఫరీ కేవలం హెచ్చరికతో సరిపెడతారా లేదా డీమరిట్ పాయింట్లు, జరిమానా వంటివి విధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే యువ ఆటగాళ్ల మధ్య భావోద్వేగాల కారణంగా జరిగిన చిన్నపాటి ఘర్షణగా భావిస్తే.. కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి సూర్యవంశీపై ఎలాంటి చర్యలు ఉంటాయో.
అద్భుత పోరాటం చేసిన భారత్-ఎ:
143 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్-ఎ’ జట్టును సుర్యాంశ్ షెడ్జే (72), విప్రాజ్ నిగమ్ (51) ఆదుకున్నారు. వీరిద్దరి మధ్య 104 పరుగుల భాగస్వామ్యం భారత్‌ను 265 పరుగుల స్కోరుకు చేర్చింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక తరఫున సదీర సమరవిక్రమ 93 పరుగులతో అద్భుతంగా రాణించాడు. చివరి దశలో అర్షద్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను తిరిగి పోటీలోకి తీసుకొచ్చినా.. సూపర్ ఓవర్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఈ ఓటమితో తిలక్ వర్మ సారథ్యంలోని ఇండియా టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో రెండో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే అఫ్గానిస్థాన్‌పై ఓడిన టీమిండియాకు ఈ ఫలితం మరో ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు శ్రీలంక ఫైనల్ బెర్త్‌కు మరింత చేరువైంది.

