Vaibhav Sooryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? వైభవ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!

Vaibhav Suryavanshi (2)

Vaibhav Suryavanshi (2)

Vaibhav Sooryavanshi: వన్డే మ్యాచ్‌లో 250 పరుగుల లక్ష్యమంటే ఏ జట్టుకైనా కాస్త పోరాటం తప్పదు. కానీ, ఒకే ఒక్క కుర్రాడు క్రీజులో పాతుకుపోయి ఆ మొత్తం టార్గెట్‌ను తన భుజాలపై వేసుకుని చిత్తు చేస్తే ఎలా ఉంటుంది? ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అచ్చం అలాంటి అద్భుతమే జరిగింది. టీమిండియా యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. యూఏఈ బౌలర్లకు కనీసం కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా 53 బంతుల్లో 204 పరుగులు బాదాడు.

సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకునేందుకు 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టుకు వైభవ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే బంతిని బౌండరీ దాటించడమే పనిగా పెట్టుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చి 28 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. వైభవ్ బాదుడు ఏ స్థాయిలో సాగిందంటే.. ఇన్నింగ్స్ 7 ఓవర్లు ముగిసేసరికే భారత్ 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా రింకూ సింగ్‌తో కలిసి విధ్వంసాన్ని కొనసాగించిన వైభవ్, మొత్తం 28 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 384.91 స్ట్రైక్ రేట్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసి జట్టుకు విజయాన్ని మరింత దగ్గర చేశాడు.

ఈ సునామీ ఇన్నింగ్స్‌తో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (29 బంతులు – 2023), సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ (31 బంతులు – 2015) రికార్డులను 15 ఏళ్ల వయసులోనే వైభవ్ తుడిచిపెట్టేశాడు. వీరి తర్వాత నాలుగో స్థానంలో సకిబుల్ గని (32 బంతులు – 2025) ఉన్నాడు. కేవలం ఫాస్టెస్ట్ సెంచరీ మాత్రమే కాదు, ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో వైభవ్ మరో రెండు పెను ప్రపంచ రికార్డులను కూడా బద్దలుకొట్టాడు. లిస్ట్-ఏ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ (52 బంతుల్లో) పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో చాడ్ బోవ్స్ (103 బంతులు – 2024) పేరిట ఉన్న రికార్డును దాదాపు సగం బంతుల్లోనే తిరగరాయగా, ఆ తర్వాతి స్థానాల్లో ఎన్.జగదీశన్ (114 బంతులు – 2022), హ్యారీ బ్రూక్ (114 బంతులు – 2026) ఉన్నారు. అంతేకాకుండా, అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్ ఫార్మాట్లలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (28 సిక్సర్లు) బాదిన ఆటగాడిగానూ వైభవ్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ (26 సిక్సర్లు – 2024) నెలకొల్పిన రికార్డును అధిగమించిన వైభవ్, ఆ జాబితాలో కోలిన్ మున్రో (23 సిక్సర్లు – 2015), డార్సీ షార్ట్ (23 సిక్సర్లు – 2018)లను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 249 పరుగులు చేసింది. ఆ జట్టులో హర్‌ప్రీత్ సింగ్ భాటియా (144 బంతుల్లో 130) ఎంతో శ్రమించి సెంచరీ సాధించగా, భారత బౌలర్ అర్షద్ ఖాన్ 4 వికెట్లతో రాణించాడు. యూఏఈ జట్టు మొత్తం 50 ఓవర్లు కష్టపడి చేసిన స్కోరును, వైభవ్ ఒక్కడే కేవలం 52 బంతుల్లో కరిగించేయడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.