U19 World Cup 2026 Schedule: పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఐసీసీ తన వెబ్‌సైట్‌లో టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్న 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈసారి కూడా భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉన్నాయి. దాంతో గ్రూప్ దశలో దాయాది దేశాలు తలపడవు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు తన మొదటి మ్యాచ్‌లో అమెరికా (యూఎస్ఏ)ను ఢీకొట్టనుంది.
మెగా టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. 23 రోజుల పాటు 41 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్-ఎలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్ టీమ్స్ ఉన్నాయి. గ్రూప్-బిలో జింబాబ్వే, పాకిస్థాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్ ఉండగా.. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక టీమ్స్ ఉన్నాయి. ఇక గ్రూప్-డిలో టంజానియా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి. టోర్నీలో టంజానియా తొలిసారి ఆడుతోంది. జపాన్ 2020 తర్వాత తిరిగి ఆడుతోంది.
Also Read: Shai Hope: చరిత్ర సృష్టించిన షాయ్ హోప్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
జనవరి 15న అమెరికాతో, జనవరి 17న బంగ్లాదేశ్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు బులవాయోలో జరుగుతాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ దశలో ప్రతి గ్రూప్ నుంచి టాప్-3లో నిలిచిన జట్లు సూపర్-6కు అర్హత సాధిస్తాయి. రెండు సూపర్-6 గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన టీమ్స్ సెమీస్‌కు చేరతాయి. 4 టీమ్స్ సెమీ ఫైనల్స్ ఆడుతాయి. రెండు జట్లు ఫైనల్లో తలపడుతాయి. 2024లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇక భారత్ అత్యధికంగా ఐదు టైటిళ్లు (2000, 2008, 2012, 2018, 2022) గెలిచింది.
