Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్

  • ఒత్తిడిలోనూ తెలుగు మాటలతో ఆకట్టుకున్న కుర్రాళ్లు
  • తిలక్ వర్మ మెరుపు అర్ధసెంచరీ
  • నితీష్ రెడ్డి దూకుడుతో భారత్‌కు విజయం
  • తెలుగు సంభాషణపై నెటిజన్ల ఆసక్తి
Nitish Tilak

Nitish Tilak

క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మన తెలుగు కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. ఒకానొక దశలో ఓటమి అంచుల్లో నిలిచిన టీమిండియాను, తెలుగు తేజాలు తిలక్ వర్మ , నితీష్ కుమార్ రెడ్డి తమ అసాధారణ బ్యాటింగ్‌తో గెలుపు తీరాలకు చేర్చారు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 4 వికెట్ల తేడాతో భారత్‌కు అదిరిపోయే విజయాన్ని అందించారు. ఈ చారిత్రక విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

కివీస్ నిర్దేశించిన లక్ష్యం.. తడబడిన మిడిలార్డర్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (70), బెవాన్ జాకబ్స్ (58) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించారు. అనంతరం 181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మిడిలార్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరడంతో మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ వైపు మొగ్గింది. టీమిండియా ఓటమి ఖాయమనుకున్న తరుణంలో తెలుగు కుర్రాళ్లు క్రీజులోకి అడుగుపెట్టారు.

స్టంప్ మైక్‌లో రికార్డైన మన తెలుగు కుర్రాళ్ల మాటలు.. నెట్టింట వైరల్

అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్‌లో క్రీజులో ఉన్న సమయంలో ఈ ఇద్దరు తెలుగు కుర్రాళ్ల మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డైంది. అంతర్జాతీయ వేదికపై, అది కూడా విదేశీ గడ్డపై తెలుగులో మాట్లాడుకుంటూ వారు చేసిన బ్యాటింగ్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఆసక్తికర సంభాషణలో నువ్వు కాల్ ఇవ్వలేదంటూ తిలక్ అంటుంటే.. నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే అంటూ నితీష్ సమాధానం ఇచ్చాడు.. దీనికి తిలక్.. రేయ్ రెండు అని చెప్పురా పోనీ అంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

చరిత్ర సృష్టించిన తెలుగు జోడీ.. భారత్‌కు అద్భుత విజయం

ఈ ఇద్దరు తెలుగు కుర్రాళ్లు కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు జోడించి మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. తిలక్ వర్మ కేవలం 26 బంతుల్లోనే 51 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ బాదగా, నితీష్ కుమార్ రెడ్డి కేవలం 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి కివీస్ బౌలర్ల వ్యూహాలను దెబ్బతీశారు. వీరిద్దరి వీరవిహారంతో భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. విదేశీ గడ్డపై తెలుగు భాషలో ముచ్చటిస్తూ ఒత్తిడిని జయించి భారత్‌కు విజయం అందించిన ఈ జోడీపై ఇప్పుడు ప్రశంసల వెల్లువ కురుస్తోంది.