NTV Telugu Site icon

ICC WTC: ఆసీస్‌పై విజయంతో భారత్ స్థానానికి ఎసరు పెట్టిన శ్రీలంక

Srilanka

Srilanka

గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23లో శ్రీలంక జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. డబ్ల్యూటీసీ సెకండ్ ఫేజ్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్థానానికి దెబ్బ పడటంతో పాటు టీమిండియా స్థానానికి కూడా శ్రీలంక ఎసరు తెచ్చింది. తాజా ఓటమితో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా 71.43 విన్నింగ్ పర్సంటేజీతో అగ్రస్థానానికి చేరుకుంది.

ఆస్ట్రేలియాపై గెలుపుతో శ్రీలంక ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న టీమిండియా ఐదో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ మాత్రం నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. ఆరో స్థానంలో వెస్టిండీస్, ఏడో స్థానంలో ఇంగ్లండ్, 8వ స్థానంలో న్యూజిలాండ్, 9వ స్థానంలో బంగ్లాదేశ్, 10వ స్థానంలో జింబాబ్వే కొనసాగుతున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా భారత్ ఇప్పటివరకు నాలుగు సిరీస్‌ల ద్వారా 12 టెస్టులు ఆడగా వాటిలో ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. భారత్ పరాజయాల్లో రెండు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. మరో రెండు ఇంగ్లండ్ పర్యటనలో చోటుచేసుకున్నాయి. మరో రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి.