NTV Telugu Site icon

Team India: టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డు

Team India

Team India

టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారిగా 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇంగ్లీష్ జట్టు మరో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే కొట్టేసింది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల ఆధిక్యాన్ని పొంది టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా సేన 132 పరుగుల తొలి ఇన్నింగ్స్ సంపాదించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 284 పరుగులకే ఆలౌటైంది. తొలి మూడు రోజుల ఆట చూస్తే టీమిండియా గెలిచేలా అనిపించింది. కానీ నాలుగో రోజు ఆట మలుపు తిప్పింది. బౌలర్ల వైఫల్యాన్ని ఇంగ్లండ్ బ్యాటర్లు సొమ్ము చేసుకున్నారు. దీంతో ఒక్కరోజులోనే మ్యాచ్ ఫలితం తారుమారైంది.

Read Also: New Zealand Cricket: కొత్త చరిత్రకు నాంది.. స్త్రీలు, పురుషులకు సమాన వేతనం

కాగా టీమిండియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పరుగుల వరద పారించిన ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. అతడు ఐదు మ్యాచుల్లో 737 పరుగులు చేశాడు. అటు ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో ఆకట్టుకున్న బెయిర్‌ స్టోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 114 నాటౌట్ పరుగులు చేశాడు.