NTV Telugu Site icon

Team India: టీమిండియా చెత్త రికార్డు.. ఒకే ఏడాదిలో రెండు సార్లు..!!

Rohit Sharma

Rohit Sharma

Team India: మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక టీమిండియా చేతులెత్తేసింది. దీంతో భారత్ ఖాతాలో మరో ఓటమి చేరింది. గత నాలుగు టీ20లలో భారత్‌కు ఇది మూడో పరాజయం కావడం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా తాజా ఓటమితో స్వదేశంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు టీ20 మ్యాచ్‌లలో 200 ప్లస్ టార్గెట్‌లను డిఫెండ్ చేసుకోవడంలో విఫలమైన తొలి జట్టుగా టీమిండియా చెత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది జూన్ నెలలో ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో 211 పరుగులు చేసిన టీమిండియా ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. డేవిడ్ మిల్లర్, డస్సెన్ చెలరేగి ఆటడంతో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

Read Also:Team India: ఈ బౌలింగ్, ఫీల్డింగ్‌లతో మనోళ్లు ప్రపంచకప్ గెలుస్తారా?

కాగా 200 పరుగులకు పైగా స్కోర్లు చేసి కూడా టీమిండియా విఫలమవుతుండటం అభిమానులను కలవరపరుస్తోంది. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ నాసిరకంగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధాన బౌలర్ భువనేశ్వర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఓవరాల్‌గా టీమిండియా బౌలర్లు భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్ ఒక్క ఏడాదిలో అత్యధిక సార్లు టీ20ల్లో 40 ప్లస్ పరుగులు ఇచ్చిన బౌలర్లుగా చెత్త రికార్డును సాధించారు. హర్షల్ పటేల్ 5 సార్లు, అవేష్ ఖాన్ 4 సార్లు, భువనేశ్వర్ కుమార్ 4సార్లు 40 ప్లస్ పరుగులు సమర్పించుకున్నారు. ఇప్పటికైనా పదే పదే విఫలమవుతున్న సీనియర్ బౌలర్లను పక్కనపెట్టి షమీ, దీపక్ చాహర్, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, నటరాజన్, మహ్మద్ సిరాజ్ వంటి ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.