NTV Telugu Site icon

Team India: ఈ బౌలింగ్, ఫీల్డింగ్‌లతో మనోళ్లు ప్రపంచకప్ గెలుస్తారా?

Team India

Team India

Team India: ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి టీ20 చూసిన తర్వాత టీమిండియా అభిమానులందరూ ఓ అంచనాకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ గెలిచేంత సీన్ అయితే లేదని పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు టీ20ల్లో మన జట్టే తోపు అన్న ఫీలింగ్‌లో ఉన్న అభిమానులే ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న మన జట్టు గురించి అంచనాలు పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. కానీ ఆసియా కప్‌లో మనోళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఆశలు సన్నగిల్లాయి. దుబాయ్ వంటి దేశంలో బుమ్రా, హర్షల్ పటేల్, జడేజా వంటి బౌలర్లు లేకుండా ఎలా గెలుస్తాంలే అని చాలా మంది అనుకున్నారు. కానీ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తొలి టీ20 చూసిన తర్వాత ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం ఎలా ఉండబోతుందన్న విషయంపై ఓ క్లారిటీ అయితే వచ్చేసిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచకప్‌లో గెలవాలంటే కేవలం బ్యాటింగ్‌లో రాణిస్తే సరిపోదు. బౌలింగ్, ఫీల్డింగ్‌లలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. ఆస్ట్రేలియాలో వార్నర్, మిచెల్ మార్ష్, స్టాయినీస్, మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లు లేకపోయినా 209 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఛేదించింది. ఒకరకంగా ఇక్కడ ఆస్ట్రేలియా గెలిచిందని చెప్పడం కంటే టీమిండియా ఓడిందని చెప్పడమే సబబుగా ఉంటుంది. 208 పరుగులు చేసి కూడా ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేదంటే మనోళ్ల ప్రదర్శన గురించి ఏమని వివరించాలి. గ్రీన్, స్మిత్ లాంటి ఆటగాళ్లు ఇచ్చిన క్యాచ్‌లను కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ జారవిడవడం టీమిండియా విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.

Read Also:E-Pathshala For All: ‘ఇ-పాఠశాల’ అందరిదీ. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్, కామన్ మ్యాన్.. ఇలా ప్రతిఒక్కరిదీ..

అటు ఆసియా కప్ వైఫల్యాన్ని ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కొనసాగించాడు. అసలు రోహిత్ కెప్టెన్సీ వ్యూహాలు అంతుబట్టకుండా ఉన్నాయి. భువీ, హర్షల్ పటేల్ లాంటి బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్న సమయంలో ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాతో లేదా రెండు వికెట్లు తీసిన ఉమేష్‌కు బంతి ఇవ్వకపోవడం రోహిత్ కెప్టెన్సీపై అనుమానపు నీడలు కమ్మేలా చేస్తోంది. బౌలింగ్‌లో బుమ్రా ఉంటే మరోలా ఉండేదని మనం అనుకున్నా ప్రపంచకప్‌కు అతడు ఉంటాడన్న గ్యారంటీ అయితే ఇప్పటివరకు లేదు. అసలు ఫిట్‌గా లేని బుమ్రాను ప్రపంచకప్‌కు, ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేశారో సెలక్టర్లకే తెలియాలి. భారత బౌలర్లు డెత్ ఓవర్లు అయిన 17, 18, 19 ఓవర్లలో వరుసగా 15, 22, 16 పరుగులు సమర్పించుకున్నారు. ఈ మూడు ఓవర్లలో ఏ ఒక్క ఓవర్ కట్టడి చేసినా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. అయితే ఇలాంటి బౌలింగ్, ఫీల్డింగ్‌లతో భారత్ ప్రపంచ కప్ గెలవడం ముమ్మాటికీ అసాధ్యమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అటు బ్యాటింగ్‌లో టాపార్డర్ ప్రదర్శన కూడా గొప్పగా ఏమీ లేదు. టాప్-3లో కేవలం ఒక్క ఆటగాడే ఆడటం వల్ల ఉపయోగం లేదని టీమిండియా ఇప్పటికైనా గ్రహించాలి.