Asia Cup 2022: పురుషులు విఫలమైన చోట మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా శనివారం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన భారత్ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ షెఫాలి వర్మ రాణించింది. ఆమె 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు కూడా సాధించింది. దీంతో ఆమెను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
Read Also: Uttar Pradesh: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఏడుగురు మృతి
కాగా ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ మరో రికార్డును తన బుట్టలో వేసుకుంది. పిన్న వయస్సులో అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా షెఫాలి వర్మ ప్రపంచ రికార్డు సృష్టించింది. టీమిండియాకు చెందిన జెమీమా (21 ఏళ్ల 32 రోజులు) రికార్డును ఆమె (18 ఏళ్ల 253 రోజులు) బద్దలు కొట్టింది. కాగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ మహిళలు 20 ఓవర్లలో 7 వికెట్లకు 100 పరుగులే చేయగలిగారు. కెప్టెన్ నిగార్ సుల్తానా (36) టాప్‌స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో షెఫాలీ వర్మ, దీప్తి శర్మ రెండేసి వికెట్లతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా హర్మన్‌ప్రీత్‌కౌర్ దూరమవడంతో స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది.
