Site icon NTV Telugu

Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై

Mithali Raj

Mithali Raj

టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. 23 ఏళ్ల పాటు క్రికెట్‌ను ఆస్వాదించానని, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నానని మిథాలీరాజ్ వివరించింది. దీనికి అందరి ఆశీర్వాదాలు కావాలని ఆకాంక్షించింది. అనేక మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన తాను భవిష్యత్తులో మహిళా క్రికెట్ వృద్ధికి తోడ్పాటును అందిస్తానని మిథాలీరాజ్ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన మిథాలీరాజ్ ప్రపంచ మహిళా క్రికెట్‌లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఘనతను సొంతం చేసుకుంది.

Virat Kohli: అక్కడ డబుల్ సెంచరీ.. ఆ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్

మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మన దేశ గెలుపుకోసం తన వంతు కృషి చేశానని మిథాలీరాజ్ తెలిపింది. తనకు ఎంతో సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్తున్నట్లు పేర్కొంది. కాగా 1999లో 16 ఏళ్ల వయసులో మిథాలీ రాజ్ ఇండియాకు క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. తొలి మ్యాచ్‌లో మిథాలీరాజ్ (114 నాటౌట్) సెంచరీతో సంచలనం సృష్టించింది. 2017 ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా భారత జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లింది. వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. సచిన్ తర్వాత 23 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌ను పూర్తి చేసుకున్న రెండో క్రికెటర్‌గా మిథాలీరాజ్ చరిత్ర సృష్టించింది. అర్జున, పద్మశ్రీ, ఖేల్ రత్న వంటి అవార్డులను కూడా మిథాలీరాజ్ అందుకుంది. మిథాలీరాజ్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో 232 వన్డేలు ఆడి 50.7సగటుతో 7,805 పరుగులు, 89 టీ20లు ఆడి 37.5 సగటుతో 2,364 పరుగులు, 12 టెస్టులు ఆడి 43.7 సగటుతో 699 పరుగులు చేసింది. మహిళల వన్డేల్లో 7వేల పరుగుల మార్కు అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు సృష్టించింది.

Exit mobile version