Site icon NTV Telugu

T20 World Cup 2022: ముగిసిన క్వాలిఫయర్స్.. టీమిండియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్

Team India

Team India

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారంతో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌ల నుంచి నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధించాయి. గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్ అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ క్వాలిఫై అయ్యాయి. వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత ప్రపంచకప్‌లో ఆడిన నమీబియా, స్కాట్లాండ్ స్థానంలో ఈ వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్, జింబాబ్వే వచ్చాయి. సూపర్-12లో ఆరేసి జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-1లో న్యూజిలాండ్‌, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఐర్లాండ్ ఉండగా.. గ్రూప్‌-2లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్, భారత్‌, పాకిస్థాన్‌, జింబాబ్వే ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య అక్టోబర్ 22న జరిగే తొలి మ్యాచ్‌తో సూపర్‌ -12 పోరు ప్రారంభం అవుతుంది.

టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్
అక్టోబర్ 23న టీమిండియా తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. మెల్‌బోర్న్ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 30న పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. నవంబర్ 2న అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌‌తో టీమిండియా ఆడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతుంది. నవంబర్ 6న మెల్‌బోర్న్ వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ నెట్‌వర్క్ ఛానళ్లతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం అవుతాయి.

Exit mobile version