NTV Telugu Site icon

T20 World Cup: పాండ్యాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదు.. స్పష్టం చేసిన టీమిండియా కోచ్

Hardik Pandya

Hardik Pandya

T20 World Cup: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి ఇస్తారని వస్తున్న వార్తలపై టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. ప్రస్తుతం పాండ్యా ఫిట్‌గానే ఉన్నాడని.. తదుపరి మ్యాచ్‌కు అతడికి విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. తాము ఎవ్వరికీ విశ్రాంతి ఇవ్వాలని కోరుకోవడం లేదని.. టీ20 ప్రపంచకప్‌లో ఇంకా మరింత ముందుకు వెళ్లే అనుకూలత తమకు ఉందన్నాడు. ఆటగాళ్లందరూ ఫామ్‌లోకి రావాల్సి ఉందని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తెలిపాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కొంచెం అలసటకు గురైనట్లు కనిపించిన పాండ్యాకు తదుపరి మ్యాచ్‌ నుంచి రెస్ట్ ఇస్తారంటూ సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీకి పాండ్యా ఇచ్చిన సహకారం మరువలేనిదని పేర్కొన్నాడు.

Read Also: Eng vs Ire: ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాక్‌.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం

ఈ టోర్నమెంట్‌లో హార్దిక్ పాండ్యా అన్ని మ్యాచ్‌లు ఆడతాడని తాను భావిస్తున్నట్లు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వెల్లడించాడు. పాండ్యా తమకు చాలా ముఖ్యమైన ఆటగాడు అని.. బౌలింగ్‌తో పాటు అతడు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాక్‌తో విజయంలో అశ్విన్‌ది కూడా కీలక పాత్రేనని పరాస్ మాంబ్రే అభిప్రాయపడ్డాడు. చివరి ఓవర్ చివరి బంతిని అశ్విన్ కాబట్టే వదిలేశాడని.. మరే బ్యాటర్ ఉన్నా ఆడేవాడని తెలిపాడు. అశ్విన్ సమయస్పూర్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని పరాస్ మాంబ్రే అన్నాడు. యువబౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా అసాధారణంగా రాణించాడని. అతడు ఒత్తిడిని ఎదుర్కొన్న తీరును చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు.