భారత క్రికెట్ జట్టు సాధారణంగా స్వదేశంలో అద్భుతమైన ప్రదర్శనలతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అభిమానులను నిరాశపరిచే రీతిలో పరాజయాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా భారీ పరుగుల తేడాతో ఓడిన మ్యాచ్‌లు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం (జనవరి 28) విశాఖలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ కూడా ఉంది. సొంతగడ్డపై భారీ పరాజయాల లిస్ట్ ఓసారి చూద్దాం.
2025లో ముల్లాన్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్.. భారత జట్టుకు స్వదేశంలో పరుగుల పరంగా ఎదురైన అతిపెద్ద పరాజయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితం భారత అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. 2026లో విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమి టీమిండియా ప్రదర్శనపై ప్రశ్నలు లేవనెత్తింది.
2022లో ఇండోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో ఓడింది. అప్పట్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ జట్టు విఫలమైంది. 2016లో నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మంచి ప్రదర్శనతో భారత్‌పై ఆధిపత్యం చెలాయించింది. 2017లో రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. స్వదేశంలో వరుసగా న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఈ ఓటములు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. మొత్తంగా చూస్తే.. భారత్ స్వదేశంలో బలమైన జట్టే అయినప్పటికీ కొన్ని మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేసింది.
