NTV Telugu Site icon

IND Vs ENG: పంత్, జడేజా సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన టీమిండియా

Ravindra Jadeja

Ravindra Jadeja

బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి రోజు పంత్ మెరుపు సెంచరీ చేయగా.. రెండో రోజు తొలి సెషన్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జడేజాకు ఇది మూడో సెంచరీ కాగా ఈ ఏడాది రెండో సెంచరీ. అటు ఓవర్సీస్‌లో మాత్రం జడేజాకు ఇదే తొలి సెంచరీ. అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజా సెంచరీ(104) చేయగానే అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అటు కెప్టెన్ బుమ్రా 16 బంతుల్లో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లు తీయగా.. పాట్స్ 2 వికెట్లు, బ్రాడ్, స్టోక్స్, రూట్ తలో వికెట్ సాధించారు.

Read Also: IND Vs ENG: ధోనీ, సచిన్ రికార్డులను బ్రేక్ చేసిన పంత్

కాగా ఈ టెస్టులో 98 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయిన దశలో పంత్, జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. టీమిండియా ఆరో వికెట్ తరఫున ఇది ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం. 1986లో ఆస్ట్రేలియాపై రవిశాస్త్రి, వెంగ్ సర్కార్ ఆరోవికెట్‌కు 298 పరుగులు జోడించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 1986లోనే అజారుద్దీన్, కపిల్ దేవ్ జోడీ శ్రీలంకపై ఆరో వికెట్‌కు 272 పరుగులు చేసి రెండో స్థానంలో, 2009లో ధోనీ, రాహుల్ ద్రవిడ్ శ్రీలంకపై 224 పరుగులు చేసి మూడో స్థానంలో, 1997లో అజారుద్దీన్, టెండూల్కర్ జోడీ దక్షిణాఫ్రికాపై 222 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నారు.