ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ-2022లో తమిళనాడుకు చెందిన అన్నదమ్ములు అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే మ్యాచ్‌లో ఒకే జట్టు తరఫున సెంచరీలు కొట్టిన కవలలుగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒకే జట్టు తరఫున శతకాలు బాదేసిన కవలలుగా కూడా నిలిచారు. గౌహతి వేదికగా జరుగుతున్న ఎలైట్ గ్రూప్ హెచ్ మ్యాచులో ఛత్తీస్‌గఢ్‌పై బాబా అపరాజిత్ (166), బాబా ఇంద్రజిత్ (127) సెంచరీలు బాదారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అపరాజిత్‌కు ఇది 10వ సెంచరీ కాగా ఇంద్రజిత్‌కు ఇది 11వ సెంచరీ.
ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తమిళనాడు తొలుత బ్యాటింగ్ చేసింది. కవల సోదరుల సెంచరీలతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 470/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కాగా అపరాజిత్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే సరదాగా అనిపిస్తుందని ఇంద్రజిత్ తెలిపాడు. చిన్నప్పటి నుంచీ తామిద్దరం ఇంతేనని.. ఒకరికొకరం సాయం చేసుకుంటామన్నాడు. తామిద్దరం గతంలోనూ ఒకే మ్యాచులో సెంచరీలు చేశామని… కానీ అప్పుడు వేర్వేరు జట్ల తరఫున చేశామని గుర్తుచేశాడు.
