De Kock, Rabada steer SA crush USA: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. బుధవారం ఆంటిగ్వా వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ప్రొటీస్ గెలిచింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన భారీ లక్ష్య ఛేదనలో అమెరికా గట్టిగా పోరాడినప్పటికీ చివరికి 176/6కు పరిమితమైంది. అండ్రీస్ గౌస్ (80; 47 బంతుల్లో 5×4, 5×6) సూపర్ ఇన్నింగ్స్, హర్మీత్ సింగ్ (38; 22 బంతుల్లో 2×4, 3×6) మెరుపులు అమెరికాను గెలిపించలేకపోయాయి. ప్రొటీస్ పేసర్ కాగిసో రబాడ (3/18) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా రెచ్చిపోయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (74; 40 బంతుల్లో 7×4, 5×6) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రీజా హెండ్రిక్స్ (11) అనంతరం ఐడెన్ మార్‌క్రమ్ (46; 32 బంతుల్లో 4×4, 1×6) అండతో డికాక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో పవర్‌ప్లేలో 64/1తో సఫారీ జట్టు నిలిచింది. డికాక్ 26 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. స్పిన్నర్ హర్మీత్ 13వ ఓవర్లో వరుస బంతుల్లో డికాక్, మిల్లర్ (0)లను ఔట్ చేశాడు. కాసేపటికే మార్‌క్రమ్ కూడా వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఇబ్బందుల్లో పడింది. ఇన్నింగ్స్ చివరలో క్లాసెన్ (36 నాటౌట్; 22 బంతుల్లో 3×6), స్టబ్స్ (20 నాటౌట్) ఆడడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 194 రన్స్ చేసింది.
Also Read: Deepika Padukone : కల్కి ఈవెంట్ లో బేబీ బంప్ తో దీపికా పదుకొనే.. ఫొటోస్ వైరల్..
ఛేదనను అమెరికా దాటిగానే ఆరంభించింది. స్టీవెన్ టేలర్ (24; 14 బంతుల్లో 4×4, 1×6) రెచ్చిపోయాడు. అయితే నాలుగో ఓవర్లో టేలర్‌ను రబాడ ఔట్ చేయగానే అమెరికా ఇన్నింగ్స్ గాడి తప్పింది. స్టార్ బ్యాటర్లు నితీశ్ కుమార్ (8), ఆరోన్ జోన్స్ (0), కోరీ అండర్సన్ (12), జహంగీర్ (3) అవుట్ అవ్వడంతో 12వ ఓవర్లో 76/5తో యూఎస్ఏ కష్టాల్లో పడింది. ఈ సమయంలో గౌస్, హర్మీత్ సింగ్ రెచ్చిపోయారు. ఇద్దరూ పోటీపడి సిక్సర్లు బాదడంతో దక్షిణాఫ్రికాలో కంగారు మొదలైంది. 15 నుంచి 18 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు పిండుకున్నారు. చివరి 2 ఓవర్లలో 28 పరుగులు అవసరమవడంతో.. అమెరికా సంచలనం సృష్టిస్తుందేమో అనిపించింది. కానీ 19వ ఓవర్‌లో హర్మీత్‌ను ఔట్ చేసిన రబాడ.. 2 పరుగులే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లో నోకియా 7 పరుగులే ఇవ్వడంతో అమెరికా ఓటమిపాలైంది.