NTV Telugu Site icon

T20 World Cup: అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్.. యూఎస్ విదేశాంగ ప్రతినిధి ఏమన్నారంటే..

Mathew Miller

Mathew Miller

T20 World Cup: T20 ప్రపంచకప్‌లో ఈసారి పాకిస్తాన్‌పై పసికూన అమెరికా గెలుపు సంచలనంగా మారింది. బలమైన పేస్, బ్యాటింగ్ లైనప్ ఉన్న పాకిస్తాన్ జట్టును సూపర్ ఓవర్‌లో అమెరికా మట్టికరిపించింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ని విలేకరులు ప్రశ్నించిన సమయంలో.. తాను ఈ విషయంలో అంత నిపుణుడిని కాదంటూ సమాధానం ఇచ్చారు.

పాకిస్తాన్ క్రికెట్ టీం ఆర్మీతో శిక్షణ తీసుకుంది, అమెరికా చేతిలో ఓడిపోయింది. దీని గురించి మీరు ఏం అనుకుంటున్నారని ఓ విలేకరి ప్రశ్నించిన నేపథ్యంలో మాథ్యు మిల్లర్ ఇలా స్పందించారు. ‘‘నాకు నైపుణ్యం ఉన్న ప్రాంతానికి మించిన విషయాలపై వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను తరుచుగా ఇబ్బందుల్లో పడతాను. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఖచ్చితంగా ఆ వర్గంలో ఉంటుందని నేను చెబుతాను’’ అని మిల్లర్ అన్నారు.

Read Also: Kuwait Fire Accident: వచ్చే నెలలో వివాహం.. కొడుకు మిస్సింగ్.. ఓ తల్లి ఆవేదన..

టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ వర్సెస్ అమెరికా మ్యాచ్ హైలెట్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఆ తర్వాత 20 ఓవర్లలో అమెరికా 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో అమెరికా 18 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 13 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో సొంతదేశంలో పాక్ టీంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇదే కాకుండా భారత్ చేతిలో కూడా పాకిస్తాన్ ఓడిపోవడంతో పాక్ టీంపై ట్రోల్స్ మొదలయ్యాయి. 120 పరుగుల టార్గెట్‌ని సాధించలేక, భారత బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు వణికిపోయారు. ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్‌కి దాసోహయ్యారు. ప్రస్తుతం సూపర్-8కి అర్హత సాధించేందుకు ఆదివారం ఐర్లాండ్‌తో పాకిస్తాన్ తలపడబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇండియా, యూఎస్ఏ మొదటి రెండుస్థానాల్లో ఉన్నాయి. మూడో స్థానంలో పాకిస్తాన్ ఉంది.