NTV Telugu Site icon

IND vs PAK T20 World Cup 2024: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు.. ఆందోళనలో ఫాన్స్!

Ind Vs Pak

Ind Vs Pak

Terror Threat To Ind vs Pak Match in T20 World Cup 2024: మరో మూడు రోజుల్లో వెస్టిండీస్‌, యూఎస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్‌ వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. మూడు వారాల క్రితమే ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముష్కర ముఠాలు ముప్పు తలపెట్టనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ ఉగ్ర ముఠా చేసిన పోస్ట్ ఇందుకు కారణం. ‘మీరు టీ20 ప్రపంచకప్‌ 2024 మ్యాచ్‌ల కోసం వేచి చూస్తున్నారు. మేము మీకోసమే ఎదురుచూస్తున్నాం’ అని ఓ ఓ ఉగ్ర ముఠా పోస్ట్ చేసింది. దానికి ఓ వ్యక్తి ఆయుధాలు ధరించి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. అంతేకాదు ‘నసావు స్టేడియం.. 09/06/2024’ అని కూడా ఆ పోస్టులో రాసుంది. దాంతో దాయాదుల మ్యాచ్‌కు ఉగ్రముప్పు ఉందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read: Ambati Rayudu: అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు!

ఈ ఉగ్రముప్పుపై ఐసీసీ, న్యూయార్క్‌ గవర్నర్ ఆఫీస్‌ స్పందించింది. ప్రజా భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రశాంతంగా టీ20 ప్రపంచకప్‌ 2024 మ్యాచ్‌లను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ‘న్యూయార్క్‌ పోలీస్‌కు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భద్రతను కట్టుదిట్టం చేస్తాం. ప్రజల భద్రతే మాకు ముఖ్యం. మ్యాచ్‌లను అందరూ ఆస్వాదించేలా నిర్వహిస్తాం’ అని న్యూయార్క్‌ గవర్నర్‌ కాతీ హోచుల్ తెలిపారు. ప్రపంచకప్‌ 2024ని సురక్షితంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకున్నాం, ప్రతి ఒక్కరి భద్రతే తమకు ముఖ్యం అని ఐసీసీ అధికారులు చెప్పారు.