NTV Telugu Site icon

Super Over: టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్‌ ఓవర్‌లో నమీబియా విజయం!

Namibia Vs Oman

Namibia Vs Oman

Namibia Win in Super Over Against Oman: టీ20 ప్రపంచకప్‌ 2024లో తొలి సూపర్‌ ఓవర్‌ నమోదైంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌, నమీబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితం సూపర్‌ ఓవర్‌లో తేలింది. సూపర్‌ ఓవర్‌లో ఒమన్‌పై నమీబియా అద్భుత విజయం సాధించింది. విజయం కోసం ఇరు జట్లు పోరాడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన నమీబియా 21 పరుగులు చేయగా.. ఒమన్‌ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఓడింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. నమీబియా పేసర్‌ రూబెన్ ట్రంపెల్మాన్ చెలరేగడంతో ఒమన్‌ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కశ్యప్ (0), నసీమ్ ఖుషీ (6), అకిబ్ ఇలియాస్ (0) పెవిలియన్ చేరారు. ఈ సమయంలో జీషన్ మక్సూద్ (20; 20 బంతుల్లో 4 ఫోర్స్), ఖలీద్ కైల్ (34; 39 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) జట్టును ఆదుకున్నారు. అయాన్ ఖాన్ (15) రాణించారు. రూబెన్ 4 వికెట్స్ తీయగా.. డేవిస్‌ వైస్ 3, గెర్హార్డ్ ఎరాస్మస్ 2 వికెట్స్ తీశారు.

అనంతరం ఛేదనలో నమీబియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మైఖేల్ వాన్ లింగేన్ డకౌట్ అయ్యాడు. నికోలాస్ డేవిన్ (24), జేన్ ఫ్రైలింక్ (45; 48 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ (3/7) మూడు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దాంతో 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. నమీబియా ఒక్క పరుగే చేసింది.

Also Read: Preity Zinta: నా కెరీర్‌లో కఠినమైన సినిమా ఇదే: ప్రీతీ జింటా

మ్యాచ్‌లో తేలిపోయిన నమీబియా.. సూపర్ ఓవర్‌లో మాత్రం చెలరేగింది. ఓ సిక్స్, 3 బౌండరీలతో 21 పరుగులు సాధించింది. డేవిడ్ వైస్ ఫోర్, సిక్స్ బాధగా.. ఎరాస్మస్ రెండు ఫోర్లు కొట్టాడు. బిలాల్ ఖాన్ 21 రన్స్ ఇచ్చాడు. సూపర్ ఓవర్ ఛేదనలో ఒమన్ ఓ వికెట్ కోల్పోయి 10 పరుగులే చేసింది. డేవిడ్ వైస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. డేవిడ్ వైస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

Show comments