Saleem Malik on Pakistan Defeat against India: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ మరో ఓటమిని చవిచూసింది. పసికూన అమెరికాపై ఓడిన పాక్.. తాజాగా టీమిండియా చేతుల్లోనూ పరాభవం ఎదుర్కొంది. భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ (113/7) విఫలమైంది. తమ జట్టు ఓటమికి భారత అద్భుతమైన బౌలింగ్‌తో పాటు పాక్ బ్యాటర్ల తప్పిదాలే కారణమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ పేర్కొన్నాడు. ఇమాద్ వసీమ్ ఇన్నింగ్స్ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే బంతులు వృథా చేసినట్లు అనిపించిందని ఆరోపించాడు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 120 బంతుల్లో 59 బంతులు డాట్స్‌లే ఉండడం గమనార్హం. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇమాద్.. 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఇమాద్ వల్లే లక్ష్య ఛేదన మరింత సంక్లిష్టంగా మారిందని సలీమ్ మాలిక్ విమర్శించాడు. ‘ఓసారి ఇమాద్ వసీమ్ ఇన్నింగ్స్‌ను గమనించండి. చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉన్నా.. ఆడలేదు. బంతులను బాగా వృథా చేశాడు. దీంతో లక్ష్య ఛేదన కష్టంగా మారిపోయింది. ఒకవేళ ఇమాద్ కొన్ని పరుగులు చేసి ఉంటే.. పాక్ గెలిచేందుకు అవకాశం ఉండేది’ అని ఓ టీవీ కార్యక్రమంలో సలీమ్ అన్నాడు.
Also Read: Jasprit Bumrah: టీ20ల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు!
ఇదే చర్చలో పాల్గొన్న పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా ఓటమిపై స్పందించాడు. ‘పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉన్నట్లు లేదు. కెప్టెన్ బాబర్ ఆజామ్‌తో ఆటగాళ్లకు సమస్యలు ఉన్నాయేమో. జట్టులోని ప్రతి ఒక్కరికి కెప్టెన్ మద్దతుగా నిలవాలి. జట్టును నాశనం చేయాలన్నా లేదా మంచి టీమ్‌గా మార్చాలన్నా సారథికే సాధ్యం. ఈ టోర్నీ ముగిసిన తర్వాత దీనిపై వివరంగా మాట్లాడతా. ఇప్పుడు మాట్లాడితే నేను షహీన్ ఆఫ్రిదికి మద్దతుగా మాట్లాడుతున్నా అంటారు. అతడు నా అల్లుడు కాబట్టే.. బంధుప్రీతి చూపానని అనేవారు లేకపోలేదు’ అని అఫ్రిది తెలిపాడు.