Rohit Sharma on ICC World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం భారత జట్టుకు తృటిలో చేజారింది. దాంతో టీమిండియా క్రికెటర్స్ అందరూ ఫైనల్ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికే పలుమార్లు ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై స్పదించిన హిట్‌మ్యాన్.. తాజాగా మరోసారి ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తనను అప్పుడప్పుడు కలవరానికి గురి చేస్తోందని రోహిత్ తెలిపాడు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత రోజు ఉదయం వచ్చిన కల గురించి తన భార్య రితికాకు చెప్పిన విషయాన్ని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. ‘ప్రపంచకప్ ఫైనల్ తర్వాత రోజు ఉదయం నిద్ర లేచా. ఆ రాత్రి టీమిండియా ఓడిపోయినట్లు కల వచ్చింది. ‘ఆ కలే నిజమవుతుందా?. రేపు కదా మనం ఫైనల్ మ్యాచ్ ఆడాల్సింది’ అని పక్కనే ఉన్న రితికాతో అన్నా. కాసేపటికి అసలు విషయం గ్రహించా. నిన్ననే కదా మ్యాచ్ అయిందని గుర్తొచ్చింది. 4-5 రోజుల పాటు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయా. నాలుగేళ్ల తర్వాతే మళ్లీ వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం వస్తుందనుకున్నా’ అని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చెప్పాడు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.770 పెరిగింది!
‘వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ వరకు మేం వరుస విజయాలు సాధించాం. అప్పటివరకు సరైన దారిలోనే ఉన్నాం. కప్ అందుకొనేందుకు చేరువగా వచ్చామని అంతా భావించారు. కానీ ఫైనల్‌లో అనూహ్యంగా ఓడిపోయాం. అహ్మదాబాద్‌లో ఉండేందుకు నా మనసు అస్సలు అంగీకరించలేదు. త్వరగా ప్రెసెంటేషన్ కార్యక్రమం ముగించి వెళ్లిపోదామనుకున్నా. తీవ్ర నిరాశలో ప్రతి భారత క్రికెటర్ ఉన్నాడు. జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఆ సమయంలో అర్థం చేసుకోలేం. అంతటి కోపం, నిరాశ ఎదురయ్యాయి’ అని రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ ఘనంగా ప్రారంభించింది. ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించి మంచి ఊపులో ఉంది.