Philip Salt hits 4,6,4,6,6,4 in One Over vs Romario Shepherd: ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ బౌలర్‌లను ఊచకోత కోశాడు. సాల్ట్ ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోయి హాఫ్ సెంచరీ (87 నాటౌట్; 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేశాడు. ముఖ్యంగా రొమారియో షెఫర్డ్ వేసిన 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇనింగ్స్ రెండో ఓవర్ వేసిన రొమారియో షెఫర్డ్ 11 రన్స్ ఇచ్చాడు. దాంతో విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ అతడికి బంతిని ఇవ్వలేదు. 16వ ఓవర్‌లో బంతిని ఇవ్వగా.. ఫిలిప్ సాల్ట్ రెచ్చిపోయాడు. తొలి బంతిని ఎక్సట్రా కవర్ మీదుగా ఫోర్ బాదిన సాల్ట్.. రెండో బంతిని స్ట్రయిట్ సిక్సర్‌గా బాదాడు. మూడో బంతిని అప్పర్ కట్‌తో బౌండరీ బాదగా.. నాలుగో బంతికి లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఐదవ బంతిని డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ మీదుగా సిక్సర్ బాధగా.. ఆఖరి బంతిని మిడాఫ్ మీదుగా ఫోర్ కొట్టాడు. దాంతో ఓవర్‌లోని అన్ని బాల్స్ ఫోర్లు, సిక్స్‌లే వెళ్లాయి. సాల్ట్ దెబ్బకు షెఫర్డ్ ఏకంగా 30 రన్స్ ఇచ్చుకున్నాడు.
Also Read: ENG vs WI: చెలరేగిన సాల్ట్, బెయిర్‌స్టో.. సూపర్-8లో విండీస్‌ను చిత్తుచేసిన ఇంగ్లండ్!
ఫిలిప్ సాల్ట్ విధ్వంసంతో 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఇట్టే ఊదిపడేసింది. 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సాల్ట్ సహా జానీ బెయిర్‌స్టో (48 నాటౌట్: 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్(25) ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. విండీస్ బౌలర్లలో రస్సెల్, ఛేజ్ తలో వికెట్ సాధించారు. అంతకముందు వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసింది. రోవ్‌మన్ పావెల్ (36), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (28) ధాటిగా ఆడారు.