NTV Telugu Site icon

Mohammad Rizwan: ఆ వ్యక్తికి విలువలు, సంస్కారం లేవు.. వెంటనే క్షమాపణలు చెప్పాలి!

Mohammad Rizwan Cry

Mohammad Rizwan Cry

Mohammad Rizwan React on Haris Rauf Incident: పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ అమెరికాలో ఓ అభిమానితో గొడవపడడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వడం చకచకా జరిగిపోయాయి. టీ20 ప్రపంచకప్‌ 2024లో పాక్ పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో.. అమెరికాలో తన సతీమణితో కలిసి వెళ్తున్న రవూఫ్‌పై ఓ అభిమాని తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో ఆగ్రహించిన రవూఫ్‌.. ఆ అభిమాని మీదికి దూసుకెళ్లాడు. అభిమాని మీద దాడి చేయబోతున్న రవూఫ్‌ను అతడి భార్య సహా చుట్టూ ఉన్న వాళ్లు ఆపారు.

ఈ ఘటనపై పాకిస్థాన్‌ వికెట్ కీపర్ మహ్మద్‌ రిజ్వాన్‌ స్పందిస్తూ తన సహచరుడు హారిస్‌ రవూఫ్‌కు మద్దతుగా నిలిచాడు. ‘హారీస్ రవూఫ్‌ను అగౌరవపరిచిన వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన వాడా? లేదా భారత్‌కు చెందిన వాడా? అనేది అప్రస్తుతం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తికి విలువలు, సంస్కారం లేవు. ముఖ్యంగా కుటుంబసభ్యుల ముందు ఏ వ్యక్తినైనా అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తనకు స్వస్తి పలకాలి. ప్రస్తుత రోజుల్లో సహనం, గౌరవం, కరుణ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి’ అని రిజ్వాన్‌ ఎక్స్‌లో పేర్కొన్నాడు.

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సహా షహీన్ అఫ్రిది, హసన్ అలీ, షాదాబ్ ఖాన్, అహ్మద్ షెహజాద్ కూడా హారిస్‌ రవూఫ్‌కు మద్దతుగా నిలిచారు. అభిమానులు ఇలాంటి చర్యలకు దిగడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. కుటుంబంతో ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా ఇతరులతో ఇలా వ్యవహరించొద్దని సూచించారు. పీసీబీ ఛైర్మన్ మొహసీన్‌ నక్వీ కూడా రవూఫ్‌కు బాసటగా నిలిచారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నమని, ఇలాంటి వాటిని తాము సహించబోమన్నారు. ఈ విషయంతో ప్రమేయం ఉన్నవారు వెంటనే రవూఫ్‌కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.