NTV Telugu Site icon

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌.. భారత జట్టులో కీలక మార్పు!

Team India

Team India

IND vs AFG Predicted Playing 11: టీ20 ప్రపంచకప్‌ 2024లో గ్రూప్‌ దశను విజయవంతంగా ముగించిన భారత్.. కీలకమైన సూపర్‌-8 సవాల్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే పోరుకు రోహిత్‌ సేన అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గాన్‌పై గెలిచి.. సూపర్‌-8లో శుభారంభం చేయాలని టీమిండియా చూస్తోంది. లీగ్‌ దశలో అంచనాలకు మించి రాణించిన అఫ్గాన్‌.. పటిష్టమైన బౌలింగ్‌తో రోహిత్ సేనకు షాకివ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.

అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెన్సింగ్టన్ ఓవల్ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. దీంతో అఫ్గాన్‌తో మ్యాచ్‌లో స్పెసలిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాలని టీమిండియా మెనెజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై వేటు వేసి.. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌కు చోటు కల్పించాలని చూస్తోందట. కుల్దీప్‌ను రవీంద్ర జడేజా స్థానంలో ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టోర్నీలో ఇప్పటివరకు జడేజా పెద్దగా ఆకట్టుకోలేదు.

కుల్దీప్‌ యాదవ్ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ 2024లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఆర్ జడేజా, అక్షర్ పటేల్ జట్టులో ఉండడంతో కుల్దీప్‌కు అవకాశం రాలేదు. గ్రూప్ దశ బౌలింగ్‌ పిచ్‌లపై జరగడం కూడా ఓ కారణం. మరో మణికట్టు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ బెంచ్‌లో ఉన్నా.. ఇటీవల కాలంలో భారత్ తరఫున కుల్దీప్‌ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌ 2024లో కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దాంతో కుల్దీప్‌కు తుది జట్టులో చోటు దక్కనుంది. ఈ ఒక్కటి మినహా జట్టులో ఏ మార్పులు ఉండకపోవచ్చు.

Also Read: Sonakshi Sinha Marriage: కామూష్.. సోనాక్షి సిన్హా పెళ్లిపై స్పందించిన శతృఘ్న!

భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

Show comments