NTV Telugu Site icon

IND vs CAN: భారత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

Team India

Team India

Rain Threat To India vs Canada Match in Florida: టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్ లీగ్ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో కెనడాను మరికొన్ని గంటల్లో రోహిత్ సేన ఢీకొట్టనుంది. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించిన భారత్.. లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించాలని చూస్తోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌లలో మోస్తరు స్కోర్ చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే లాడర్‌హిల్‌లో చెలరేగాలని చూస్తోంది. భారత ధనాధన్ బ్యాటింగ్‌ను చూడొచ్చని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఆశలకు వరుణుడు చెక్ పెట్టేలా ఉన్నాడు.

భారత్, కెనడా మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉంది. మ్యాచ్‌ జరిగే బ్రోవార్డ్‌ కౌంటీలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. నేడు భారీ వర్షాలు కురిసేందుకు 86 శాతం అవకాశముందని అంచనా. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 50 శాతం వర్షం కురిసే ఛాన్స్‌లు ఉన్నాయట. దీంతో భారత్, కెనడా మ్యాచ్ జరగడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది. ఇక్కడ జరగాల్సిన నేపాల్, శ్రీలంక మ్యాచ్‌.. అమెరికా, ఐర్లాండ్‌ మ్యాచ్‌ వర్షార్పణమయ్యాయి.

Also Read: Teacher Murder: ఆదిలాబాద్ టీచర్ హత్యకేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

ఒకవేళ మ్యాచ్‌ జరిగితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పిచ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. సాధారణంగా అయితే సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ పిచ్‌ బ్యాటర్లకే అనుకూలం. ఇక్కడ 2016లో జరిగిన భారత్, వెస్టిండీస్‌ టీ20 మ్యాచ్‌లో రెండు జట్లూ 240కి పైగా స్కోర్ చేశాయి. టాస్‌ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌ తీసుకునే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ జరిగిన 16 టీ20ల్లో 11 సార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్ గెలిచింది. కెనడాతో మ్యాచ్ రద్దయినా భారత్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లీగ్ దశను టాపర్‌గానే ముగిస్తుంది.