NTV Telugu Site icon

AUS vs NAM: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!

Australia Team

Australia Team

Australia Record in T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన రెండో జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో ఆసీస్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. 86 బంతులు మిగిలుండగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని సాధించింది.

టీ20 ప్రపంచకప్‌లో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా శ్రీలంక ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2014లో నెదర్లాండ్స్‌‌పై లంక 90 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. 2021 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 82 బంతులు ఉండగానే గెలిచింది. భారత్ (81 బంతులు, స్కాట్లాండ్‌పై-2021), శ్రీలంక (77 బంతులు, నెదర్లాండ్స్‌‌పై 2021) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Also Read: AUS vs NAM: పసికూనపై పంజా విసిరిన ఆస్ట్రేలియా.. 5.4 ఓవర్లలోనే విజయం!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌట్ అయింది. గెర్హార్డ్ ఎరాస్మస్ (36; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేశాడు. మైఖేల్ వాన్ లింగేన్ (10) తప్ప మిగతా నమీబియా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా నాలుగు వికెట్స్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.