Site icon NTV Telugu

T20 World Cup 2026: మెంటలెక్కించే బ్యాటింగ్‌ లైనప్‌లు.. టీ20 వరల్డ్‌కప్‌ను కొట్టేది ఈ జట్లేనా?

T20 World Cup 2026 Batting Lineup

T20 World Cup 2026 Batting Lineup

టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రధాన జట్ల బ్యాటింగ్ లైనప్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి పలు జట్లు పవర్ హిట్టర్లతో పాటు స్టేబుల్ బ్యాట్స్‌మెన్‌లతో బలమైన బ్యాటింగ్ లైనప్‌లను సిద్ధం చేసుకున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌లతో టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌ను కొట్టే సత్తా ఏ జట్లకు ఉందో ఓసారి చూద్దాం.

భారత్:
భారత జట్టు బ్యాటింగ్ యూనిట్ యువత, సీనియర్లతో బలంగా ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆరంభంలో వేగంగా పరుగులు చేయగల సత్తా కలిగి ఉండగా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను పూర్తిగా తిప్పగల ఆటగాళ్లు. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా కీలకంగా మారనున్నాడు. రింకూ సింగ్, శివమ్ దూబే డెత్ ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇక సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా స్థిరత్వాన్ని అందిస్తాడు.

ఆస్ట్రేలియా:
ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం పవర్ హౌస్‌లా ఉంది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వేగంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలరు. మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ లాంటి పవర్ హిట్టర్లు చివరి ఓవర్లలో మ్యాచ్‌ను క్షణాల్లో ముగించగరు. కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ కూడా బ్యాటింగ్‌కు మరింత బలాన్నిఅందించగలరు. ఆసీస్ జట్టులోని ప్రతి ఒక్కరు డేంజరస్ బ్యాటర్లే. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ను ఆసీస్ కలిగి ఉంది.

న్యూజిలాండ్:
న్యూజిలాండ్ బ్యాటింగ్ యూనిట్ క్రమశిక్షణ, స్థిరత్వానికి మారుపేరు. ఫిన్ అలెన్, డెవన్ కాన్వే లాంటి ఓపెనర్లు వేగంగా పరుగులు చేస్తూ.. స్కోర్ బోర్డును పరుగెత్తిస్తారు. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర మధ్య ఓవర్లలో జట్టును ఆదుకునే సత్తా ఉన్నవారు. టీమ్ సీఫర్ట్, నిషామ్ ఫినిషర్లుగా కీలక పాత్ర పోషిస్తారు.

దక్షిణాఫ్రికా:
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యూనిట్ యువకులతో పాటు సీనియర్ల అనుభవాన్ని కలిగి ఉంది. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగలడు. డేవిడ్ మిల్లర్ లాంటి అనుభవజ్ఞుడు ఫినిషర్‌గా కీలకంగా ఉండగా.. స్టబ్స్, బ్రెవిస్, రికెల్టన్ లాంటి యువ ఆటగాళ్లు వేగంగా పరుగులు రాబట్టే సత్తా ఉన్నవారు. ఇక క్వింటన్ డికాక్ ఓపెనర్‌గా జట్టుకు భారీ ఆరంభాలు అందించే సామర్థ్యం కలిగి ఉన్నాడు.

Also Read: APSRTC Board Meeting: విజయవాడలో నేడు ఏపీఎస్ఆర్టీసీ కీలక బోర్డు సమావేశం!

ఇంగ్లాండ్:
ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ యూనిట్ పూర్తిగా దూకుడుగా ఉంటుంది. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ లాంటి బ్యాట్స్‌మెన్ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను ప్రత్యర్థుల నుంచి దూరం చేయగలరు. హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, సామ్ కరన్ లాంటి ఆటగాళ్లు మధ్య, చివరి ఓవర్లలో కీలకంగా మారగలరు. టామ్ బాంటన్ మ్యాచ్‌ను క్షణాల్లో ముగించగడు. ఇంగ్లాండ్ జట్టు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ను కలిగి ఉంది.

పాకిస్థాన్:
పాకిస్థాన్ బ్యాటింగ్ యూనిట్‌లో క్లాస్, టెక్నిక్ ఎక్కువగా కనిపిస్తుంది. బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్ లాంటి ఆటగాళ్లు పెద్ద ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం కలిగి ఉన్నారు. యువ ప్లేయర్స్ సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘాలు ధాటిగా ఆడుతారు. నవాజ్, ఉస్మాన్ లాంటి ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్‌లో కీలకంగా ఉంటారు. పవర్ హిట్టింగ్, లోతైన బ్యాటింగ్, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం దృష్ట్యా ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ జట్లు అత్యంత బలమైన బ్యాటింగ్ యూనిట్లుగా కనిపిస్తున్నాయి. అయితే టీ20 ఫార్మాట్‌లో ఆ రోజు ఎవరు ఒత్తిడిని దిగమిస్తారో వారిదే పైచేయిగా ఉంటుంది.

 

Exit mobile version