వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన టి20 ముంబై లీగ్ 2026 మ్యాచ్‌లో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఉత్కంఠభరిత పోరాటంలో ఎంఎస్‌సి మరాఠా రాయల్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి, ఈ సీజన్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రేయస్ అయ్యర్, ఆదిత్య తారే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఫాల్కన్స్ జట్టు ఆఖరి ఓవర్లో విజయాన్ని అందుకుంది.
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫాల్కన్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ప్రారంభాన్ని ఇచ్చారు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆదిత్య తారే కేవలం 19 బంతుల్లోనే 42 పరుగులతో విరుచుకుపడగా, ఇషాన్ మూల్‌చందాని 29 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో ఫాల్కన్స్ 12 ఓవర్లలో 106/2 స్కోరుతో సులభంగా గెలిచేలా కనిపించింది.
అయితే శ్రేయస్ అయ్యర్ అవుటైన తర్వాత మ్యాచ్ మలుపు తిరిగింది. మరాఠా రాయల్స్ బౌలర్లు విజృంభించడంతో ఫాల్కన్స్ కేవలం 21 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ దశలో గౌతమ్ వాఘేలా 23 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టును విజయం వైపు నడిపించాడు. ఐదు బంతులు మిగిలి ఉండగానే ఫాల్కన్స్ లక్ష్యాన్ని ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా రాయల్స్..
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన మరాఠా రాయల్స్ జట్టులో ఓపెనర్ సాహిల్ జాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ సిద్ధేష్ లాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సాహిల్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. చిన్మయ్ సుతార్ (23), అర్జున్ దానీ (35) రాణించడంతో జట్టు కోలుకుంది. ఫాల్కన్స్ బౌలర్లలో ఆకాష్ పార్కర్ 3/22, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ యష్ దిచోల్కర్ 3/25 వికెట్లతో చెలరేగడంతో రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో ఫాల్కన్స్ టోర్నమెంట్‌లో తమ మొదటి పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
