NTV Telugu Site icon

నేడే భారత్-పాక్ మధ్య టీ20 మ్యాచ్…రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు!

టీ-20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గెలుపును ఫ్యాన్స్ తమ దేశ ప్రతిష్టగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే మెగాటోర్నీల్లో పాక్‌పై భారత్‌దే పూర్తి ఆధిపత్యం కాగా.. ఆ లెక్కను సరిచేయాలనే కసితో పాక్ రగిలిపోతుంది. మరోవైపు తమకు అలవాటైన రీతిలోనే పాక్‌ను చిత్తు చేసి మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం.. ఈ హీట్‌ను మరింత పెంచుతుంది.

ఈ బిగ్ ఫైట్‌కు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. పైగా ఈ ఇద్దరూ వామప్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇక ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రావడం ఖాయం. ఫస్ట్ వామప్ మ్యాచ్‌లో పెద్దగా రాణించని కోహ్లీ.. సెకండ్ వామప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. పైగా ఇది కెప్టెన్‌గా అతనికి చివరి టీ20 ప్రపంచకప్ కావడం.. మెంటార్‌గా తన బాస్ మహేంద్ర సింగ్ ధోనీ అండ ఉండటంతో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కోహ్లీకి కావాల్సిన సమయం ఉంటుంది.

కాబట్టి అతను పాత కోహ్లీలా చెలరేగే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30కు జరగనుంది కాబట్టి మంచు కీలక పాత్ర పోషించనుంది. దీంతో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు అవకాశం దక్కనుంది. అయితే భువీని తీసుకురావాలనుకుంటే మాత్రం షమీని పక్కనపెట్టవచ్చు. ఇక ఏకైక స్పిన్నర్‌గా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని తీసుకునే చాన్స్ ఉంది. అయితే అతని ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడితే మాత్రం తుది జట్టులోకి అశ్విన్ వస్తాడు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ దమాకా. బెట్టింగ్‌ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్‌. ఈ సూపర్ సండే రోజున భారత్‌-పాకిస్తాన్ నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం బెట్టింగ్‌ రాయుళ్లు కాచుకుని కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ ఎత్తున బెట్టింగ్‌ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.