Site icon NTV Telugu

Suryakumar Yadav: రిజ్వాన్ రికార్డ్ బ్రేక్.. అగ్రస్థానంలోకి సూర్య

Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav Breaks Mohammad Rizwan Record: టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాదిలో ఎలా దుమ్ముదులుపుకుంటూ వస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. క్రీజులో కుదురుకున్నాడంటే చాలు.. ఇక పరుగుల వర్షమే! కొన్నిసార్లు ఒంటిచేత్తో భారత జట్టుని గెలిపించిన ఘనత కూడా ఇతని సొంతం. ఇప్పుడు అదే జోరుని టీ20 వరల్డ్‌కప్ టోర్నీలోనూ కొనసాగిస్తున్నాడు. పాక్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో త్వరగా ఔటయ్యాడు కానీ, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తన ప్రతాపం చూపించాడు. 25 బంతుల్లోనే అర్థశతకం చేసి, అజేయంగా నిలిచాడు. నెమ్మదిగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు.

ఈ క్రమంలోనే సూర్యకుమార్ ఒక అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ పేరిట ఉన్న ఒక రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో రిజ్వాన్‌ 839 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్‌పై సూర్య అర్థశతకం చేసి, 867 పరుగులతో అతడ్ని అధిగమించాడు. దీంతో.. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్య అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. అయితే.. టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం రిజ్వాన్ 849 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ 828 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇతర మ్యాచెస్‌లోనూ అతడు చెలరేగి ఆడితే.. త్వరలోనే రిజ్వాన్‌ని వెనక్కి నెట్టి, ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకునే వీలుంది.

కాగా.. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి విజయం నమోదు చేసిన భారత్, ఈరోజు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత్ కుదిర్చిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 123 పరుగులకే నెదర్లాండ్స్ కుప్పకూలడంతో.. 56 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో.. పాయింట్ల పట్టికలో భారత్ (+1.425 రన్ రేట్) 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

Exit mobile version