ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాకు ఊరట లభించనుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ దూరమయ్యాడు. అతడిని వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది. ఇప్పుడు అతడు దూరం కావడంతో మరో ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు క్రికెట్ విశ్లేషకులు ఓ సలహా ఇస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న సురేష్ రైనాను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలోనే రైనా అతి ముఖ్యమైన ఆటగాడు అని, అతడి రికార్డులు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. రైనాను జట్టులోకి తీసుకుంటే యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా కూడా పనికొస్తాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలున్నాయి. 32.52 సగటుతో పాటు 135 స్ట్రైక్‌రేట్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ కూడా రైనాను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రైనాను తీసుకునే విషయంపై ఆ జట్టు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.
