Sunil Gavaskar: పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే భారత్ ఓటమికి నోబాల్స్ కారణమని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా నోబాల్స్‌పై మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ప్రొఫెషనల్స్ ఇలా చేయరంటూ ఘాటుగా స్పందించాడు. ఇటీవల కాలంలో ఆటగాళ్లు తరచూ పరిస్థితులు తమ నియంత్రణలో లేవని చెప్తున్నారని.. కానీ నోబాల్ వేయడం, వేయకపోవడం మాత్రం ఆటగాడి నియంత్రణలోనే ఉంటుందని గవాస్కర్ చురకలు అంటించాడు. ప్రొఫెషనల్ ఆటగాళ్లు నోబాల్స్ వేయకూడదని హితవు పలికాడు.
Read Also: Waltair Veerayya Trailer: సోషల్ మీడియాని తాకనున్న ‘వీరయ్య తుఫాన్’
అటు అర్ష్‌దీప్ సింగ్ వరుసగా నోబాల్స్ వేయడంపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. నోబాల్ వేయడం ఓ క్రైమ్ అని.. ఇది క్షమించరాని నేరమంటూ పాండ్యా అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో రెండో టీ20లో పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వేసింది రెండు ఓవర్లే అయినా మొత్తం 5 నోబాల్స్ వేశాడు. ముఖ్యంగా తొలి ఓవర్‌లో హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలో టీ20లలో వేసిన తొలి ఓవర్‌లోనే అత్యధిక నోబాల్స్ వేసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ సింగ్ వరుసగా రెండు నోబాల్స్ వేశాడు. ఇప్పుడు తన రికార్డును తానే మెరుగుపరచుకున్నాడు. టీమిండియా బౌలర్లు మొత్తం ఏడు నోబాల్స్ వేయగా ఇందులో ఐదు నోబాల్స్ ఒక్క అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే వేశాడు.