షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. వార్న్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ కాదంటూ ఈ సమయంలో తాను వ్యాఖ్యానించాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. నిజానికి ఇలాంటి సమయంలో టీవీ ఛానల్ వారు అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు.. తాను జవాబు చెప్పాల్సింది కాదని వివరించాడు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను నిజాయితీగా తన అభిప్రాయం చెప్పినట్లు సన్నీ తెలిపాడు. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో వార్న్ ఒకడు అని.. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు.
కాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వార్న్ అత్యుత్తమ స్పిన్నరేనా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. తన దృష్టిలో షేన్ వార్న్ అత్యుత్తమ స్పిన్నర్ కాదన్నాడు. భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరన్ అతనికన్నా మెరుగైన స్పిన్నర్లు అని.. ఎందుకంటే భారత్‌లో వార్న్ రికార్డు చాలా సాధారణంగా ఉందని వివరించాడు. భారత్‌లో ఒక్కసారి మాత్రమే వార్న్ ఐదు వికెట్ల ఘనత సాధించాడని.. పైగా స్పిన్‌లో బాగా ఆడగల భారత బ్యాట్స్‌మెన్‌పై పెద్దగా విజయవంతం కాని అతడిని గొప్ప స్పిన్నర్ అనలేమంటూ గవాస్కర్ కామెంట్ చేశాడు. దీంతో గవాస్కర్‌పై క్రికెట్ అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. దీంతో గవాస్కర్ క్షమాపణ చెప్పాడు.
