NTV Telugu Site icon

హాకీ ప్లేయర్స్‌కు పోటాపోటీగా నగదు ప్రకటన….

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ ప్లేయర్లకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు బహుమతి ప్రకటిస్తున్నాయ్. పంజాబ్‌ సర్కార్‌ కోటి రూపాయలు ప్రకటిస్తే…హర్యానా రెండున్నర కోట్లు ఇస్తామని వెల్లడించింది. తామేమీ తక్కువ కాదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి సైతం…ఒక్కో ప్లేయర్‌ కోటి ఇస్తామన్నారు.

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ క్రీడాకారులకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు నజారానాలు ప్రకటిస్తున్నారు. ఒక ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తామంటే…మరో ప్రభుత్వం రెండు కోట్లు ప్రకటించింది. జట్టు సభ్యులందరికి కాదు…కేవలం ఆయా రాష్ట్ర క్రీడాకారులకు మాత్రమేనని చెబుతున్నాయ్. విశ్వక్రీడల పతకం రాకముందు పట్టించుకోని వారంతా…ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తున్నారు. కోట్ల నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

టీమిండియా హాకీ జట్టులో… ఎనిమిది మంది పంజాబీ క్రీడాకారులు ఉన్నారు. కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపిందర్‌పాల్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, శంషీర్‌ సింగ్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌, గుర్జంత్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌ పంజాబ్‌కు చెందినవారే. స్వర్ణం గెలిస్తే ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు అందజేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. ఇప్పుడు కాంస్యం తేవడంతో ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

మరోవైపు పురుషుల హాకీ జట్టులోని హరియాణా క్రీడాకారులకు…రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జట్టులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లకు రూ.2.5 కోట్ల చొప్పున నగదు ఇస్తామని వెల్లడించింది. అంతేకాకుండా క్రీడా శాఖలో ఉద్యోగం, రాయితీపై ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది. పురుషుల హాకీ జట్టు ఫొటోను ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌.

మరోవైపు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌…తామేమీ తక్కువ కాదంటున్నారు. తమ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లు వివేక్‌ సాగర్‌, నీలకంఠలకు రూ. కోటి చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చిన వెంటనే వారిని సన్మానిస్తామని వెల్లడించారు శివరాజ్‌.