17 ఓవర్లు ముగిసిపోయాయి.. శ్రీలంక స్కోరు 118/6.. మ్యాచ్ గెలవాలంటే 3 ఓవర్లలో 59 పరుగులు చేయాలి.. ఇది దాదాపు అసాధ్యమైన ఫీట్.. కాబట్టి శ్రీలంక ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. శ్రీలంక అభిమానులు సైతం మెల్లగా మైదానాన్ని వదిలి వెళ్తున్నారు. అప్పుడు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54) తాండవం చేశాడు. ఆసీస్ బౌలర్లపై మెరుపు దాడికి దిగాడు. వచ్చిన ప్రతి బంతిని బౌండరీ దిశగా బాదాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ ఓడిపోకూడదని, బ్యాట్‌తో రెచ్చిపోయాడు. దీంతో ఇంకో ఒక బంతి మిగులుండగానే శ్రీలంక విజయం సాధించింది. అవును.. 3 ఓవర్లలో 59 పరుగులు కొట్టడం అసాధ్యమనుకుంటే, సుసాధ్యం చేసి చూపించాడు దసున్.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. వార్నర్ (39), స్టొయినిస్ (38), స్మిత్ (37 నాటౌట్) స్మిత్ రాణించడంతో.. ఆస్ట్రేలియా ఆ స్కోరుకి చేరుకోగలిగింది. ఇక 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 6 వికెట్ల నష్టానికి ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి, సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే.. ఈ సిరీస్ మాత్రం ఆస్ట్రేలియాదే! ఈ రెండు జట్ల మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా.. తొలి రెండు మ్యాచులను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనుకుంది కానీ, వారి ఆశల్ని దసున్ నీరుగార్చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో దసున్ శ్రీలంక అభిమానుల్లో హీరోగా అవతరించాడు.